చంద్రాయణగుట్ట వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్
హైదరాబాద్
చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడలో, పరివార్ టౌన్ షిప్ లో వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ప్రజలు తమంత తాముగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని, ప్రజా ప్రతినిధులు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా హైదరాబాద్ నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు. ఈ ప్రాంతంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అధికారులతో ఎంక్వైరీ చేశారు. ఇంటింటి సర్వేను పూర్తిచేశామని, వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించామని అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ ప్రాంతంలో నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని స్ధానిక ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హామి ఇచ్చారు.
అర్హులైన ప్రజలందరికి మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగేలా జిహెచ్ఎంసి ఏరియా వైద్యఆరోగ్య శాఖ 100 శాతం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టింది. కాలనీల వారిగా విధానాన్ని రూపొందించి డోర్ టు డోర్ సర్వేతో పాటు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో 585 కాలనీలల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. 47,104 మందికి మొదటి విడత, 7304 మందికి రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసి నుండి 4182 మంది సిబ్బందిని, వైద్యశాఖ 1639 మంది సిబ్బందిని రంగంలోని దించడం జరిగింది. కాలనీల స్ధాయిలో మొబైల్ వ్యాక్సినేషన్ కోసం 594 వాహనాలను వినియోగించడమైనది.
ఈ పర్యటనలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎమ్ రిజ్వీ, జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.