వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి నరాల సత్యనారాయణ
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైయస్ షర్మిల
హైదరాబాద్
తెలంగాణ, సామాజిక ఉద్యమకారుడు, జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి నరాల సత్యనారాయణ వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. బుధవారం పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సత్యనారాయణ గతంలో జనసేన పార్టీ తరఫున ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ జన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్షరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరమ్, తెలంగాణ మేధావుల ఫోరమ్ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఈ సందర్భంగా నరాల సత్యనారాయణ మాట్లాడుతూ... తెలంగాణలో వైయస్ఆర్ పాలన తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణకు షర్మిల వంటి బలమైన నాయకురాలు అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని, కుటుంబ పాలనతో ప్రజలు విసిగెత్తి పోయారని తెలిపారు. హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారని దుయ్యబట్టారు. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారన్నారు. తెలంగాణలో దాదాపు 50కి పైగా సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించి, రైతులకు సాగు నీరు అందించిన మహనీయుడు వైయస్ఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ర్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, , వైయస్ఆర్ విగ్రహాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ నీలం రమేశ్ పాల్గొన్నారు.