జగన్ బెయిల్ పిటీషన్ వాయిదా
హైదరాబాద్, ఆగస్టు 25,
గన్ బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్ 15న తీర్పు ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా నేడు వాదనల ముగిశాయి. దీంతో విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్, జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌లపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఇరు పిటిషన్లపై తీర్పులు ఇస్తామని పేర్కొంది.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి.. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పొందుపరిచారు. ఏపీ సీఎంగా ఉన్నత పదవిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఆయన తన అధికారారిన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొన్నారు. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ వేసేందుకు సీబీఐ నిరాకరించింది. విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోమని సీబీఐ కోర్టుకే నిర్ణయాన్ని వదిలేసింది. దీంతో ముఖ్యమంత్రి జగన్, రఘురామ తరపు లాయర్లు మాత్రమే వాదనలు వినిపించారు. అన్నివైపుల వాదనలు పూర్తికావడంతో జులై 30న కోర్టు విచారణ ముగించింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్, సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్లపై సెప్టెంబర్ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.