గుంటూరు, ఆగస్టు 26,
లేటుగా రాజకీయాల్లోకి వచ్చినా లేటెస్టుగా రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్న నాయకురాలు.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని. ఆది నుంచి కూడా ఆమె దూకుడు సెపరేటు. ఆమె ఎప్పుడు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. సంచలనమే. ఇక, కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ ఎక్కడికక్కడ మౌనంగా ఇంటి పట్టునే ఉన్నారు. అంతేకాదు, ఏ కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. దీంతో తలతిరిగిన నాయకులు కూడా ప్రచారానికి దూరమయ్యారు. ఇలాంటి సమయంలోనూ ఉవ్వెత్తున ప్రచారంలో ముందున్నారు విడదల రజనీ. ఇక స్థానికంగా చిలకలూరిపేట మీడియాతో పాటు జిల్లా మీడియాకు కూడా నిత్యావసరాలు రెండు, మూడు సార్లు సరఫరా చేసి మీడియాను కూడా ఆకర్షించేశారు.కొవిడ్ సమయంలోనూ తన నియోజకవర్గంలో ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు రజనీ. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో నిత్యం ప్రజలకు టచ్‌లో ఉంటున్నారు. తన సందేశాలు వినిపిస్తున్నారు. దీంతో ఫేస్‌బుక్, వాట్పాప్, ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్‌ను కూడా ఆమె సంపాయించుకున్నారు. దీంతో ఇప్పుడు ఏ నోట విన్నా విడదల రజనీ పేరే వినిపిస్తోంది. పైగా తన నియోజకవర్గంలో ప్రత్యక్షంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన సమయంలోనూ ఆమె తన ఫొటోతో పెద్ద పెద్ద కటౌట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇలాంటి పెద్ద పెద్ద పోస్టర్లు.. కటౌట్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు.. స్థానికంగా ఉన్న ఎంపీ లేదా సీనియర్ నేతల ఫొటోలు కూడా ఏర్పాటు చేసుకుంటారు.కానీ, రజనీ మాత్రం సీఎం ఫొటో.. తన ఫొటో తప్ప ఇంకెవరికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కొద్ది రోజుల పాటు సీఎం ఫొటోలు కూడా లేకపోవడంతో సొంత పార్టీ నేతల్లోనే విమర్శలు వచ్చాయి. పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంతో జిల్లా స్థాయిలో చర్చ జరిగింది. అప్పటికప్పుడు సీఎం ఫొటో తెచ్చి అక్కడ అతికించారన్న టాక్ కూడా ఉంది. ఇక విడదల రజనీ ఫొటోల్లో స్థానిక సీనియర్ నేత మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఫొటోలు కూడా లేని పరిస్థితి. ఇక రాష్ట్రానికి సంబంధించి ఏవైనా కీలక ప్రాజెక్టులు వచ్చినా కూడా వాటిని తేవడంలో విడదల రజనీ పాత్రే కీలకం అని.. తానే జగన్‌తో మాట్లాడి వీటిని రాష్ట్రానికి తెచ్చేలా చేశానని పోస్టర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారట.ఏపీలో కొత్త పారిశ్రామిక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాలకే ఎమ్మెల్యే రజనీ ఫొటోలతో పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. చివరకు ఈ ప్రచారం ఏ రేంజ్‌కు వెళ్లిందంటే చిలకలూరిపేటకు శ్రీశైలం జలాలకు ఎలాంటి సంబంధం లేదు. అయితే అక్టోబర్ నాటికి వెలిగొండ జలాలు పరవళ్లు అంటూ ఆమె ఓ రేంజ్‌లో ప్రచారం చేసుకుంటున్నారు. చిలకలూరిపేటలో అతీగతీ లేకుండా ఉన్న ఆటోనగర్‌ను పట్టించుకోని విడదల రజనీ … తిరుపతి, విశాఖపట్నం సైన్స్ సిటీలపై పోస్టర్లు వేయడం ఏంటని నియోజకవర్గ ప్రజలు భగ్గుమంటున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తే సీఎం జగన్‌కు, మంత్రులకే రాని విధంగా లైకులు, షేర్లు, వ్యూస్ వస్తున్నాయట. ఇప్పుడు ఈ విషయం వైసీపీ వర్గాల్లో భారీగా చర్చకు వస్తోంది. ఇదంతా పెయిడ్ గేమ్ అని కూడా కొందరు చెపుతున్నారు.మొత్తంగా ప్రచారంలో సీఎం జగన్‌కు మించిపోయేలా విడదల రజనీ దూకుడుగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో ఆమె టార్గెట్‌లు కూడా చాలా పెద్దగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఇద్దరు మంత్రుల కూర్పులో బీసీ కోటాలో తనకు ఛాన్స్ దక్కించుకునేందుకు తుది వరకు కూడా ఆమె ప్రయత్నాలు సాగించారని అంటున్నారు. అయితే, ఈ ఛాన్స్ మిస్సవడంతో వచ్చే ఏడాది తర్వాత జరిగే మంత్రి వర్గం విస్తరణలో తనకు బెర్త్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఇలా ప్రచార పర్వంలో దూసుకుపోతే.. బెటరని ఆమె ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ప్రచారంలో వైఎస్సార్ సీపీ నేతలను రజనీ వెనక్కినెట్టారనే ప్రచారం జరుగుతోంది.