YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముందస్తుతో టీడీపీకి ముప్పేనా

ముందస్తుతో టీడీపీకి  ముప్పేనా

విజయవాడ, ఆగస్టు 26, 
మరో మారు దేశంలో జమిలి ఎన్నికల గురించి చర్చ సాగుతోంది. నిజానికి గత అయిదారేళ్ళుగా జమిలి ఎన్నికలూ అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెగ ఊదరగొడుతోంది. కానీ భారత్ లాంటి అతి పెద్ద దేశంలో ఒకేసారి పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు జరిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో ప్రాంతాలు, భాషాలు, అన్నింటికీ మించి రాజకీయ పార్టీలు ఉన్న దేశంలో ఒకే ఎన్నిక అంటే అది పెద్ద రికార్డే అవుతుంది. అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ. దానికి నాయకుడు మోడీ. ఆయన ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు కాబట్టి జమిలి ఎన్నికలు దేశాన వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అదే జరిగితే ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది అన్నదే చర్చ. ఏపీలో రెండున్నరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడి కుదేలయింది. కేవలం 23 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. రెండేళ్ళుగా ఏపీలో ప్రతిపక్ష పాత్ర సవ్యంగా నిర్వహించడంలో టీడీపీ విఫలం అయింది అనే భావన ఉంది. ఏపీ వరకూ చూస్తే టీడీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ రోజుకీ పొత్తులు కుదరలేదు. బీజేపీ దూరం పెడుతూంటే జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్స్ రావడంలేదు. ఓ వైపు రోజు రోజుకు ఏపీలో టీడీపీ గ్రాఫ్ దిగ‌జారుతూ వ‌స్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో జోష్ నింపేందుకు చంద్రబాబు గ‌త యేడాది నుంచి జ‌మిలీ అంటూ పెద్ద ఎత్తున హ‌డావిడి చేస్తున్నారు. జ‌మిలీ వ‌స్తే మేం గెలిచేస్తాం అంటూ టీడీపీ నేత‌లు కూడా ఒక్కటే హంగామా చేస్తున్నారు.మరి గందరగోళం అయోమయంగా ఉన్న రాజకీయ వాతావరణంలో జమిలి అంటే టీడీపీ సన్నద్ధం కాగలదా ? అన్నది చర్చగా ఉంది. ఇంకో వైపు చూస్తే ఈ రోజుకీ ఏపీలో వైసీపీకి ఆదరణ ఉంది. కరోనా వంటి విషమ పరిస్థితులు ఉన్నా కూడా ఏపీలో సంక్షేమాన్ని జగన్ అసలు ఆపడంలేదు. సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో ఈ క‌ష్టాల్లో కూడా జ‌గ‌న్ డ‌బ్బులు ఇవ్వడం ఆప‌లేదుగా ? అని చ‌ర్చించుకుంటున్నారు. దాంతో జగన్ తనకంటూ ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకుని ముందుకు సాగుతున్నారు.అందువల్ల 2024 నాటికి ఎన్నికలు వస్తే ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికిపుడు ఎన్నికలు అంటే మాత్రం టీడీపీ అసలు తట్టుకోలేదు అంటున్నారు. పైగా టీడీపీలో ఇప్పటికీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు స‌రైన అభ్యర్థులు లేని ప‌రిస్థితి. ఒక విధంగా కేంద్రంలోని బీజేపీకి, ఏపీలోని వైసీపీకి కూడా ఈ జమిలి ఎన్నికల వల్ల భారీ లాభం కలుగుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. జ‌మిలీతో ఏదే పొడిచేస్తాం అన్న ఊహ‌ల్లో ఉన్న టీడీపీకి నిజంగా ఎన్నిక‌లు వ‌స్తే మునుగుతాం ? అన్న వాస్తవం అయితే బోధ‌ప‌డ‌ట్లేదు.

Related Posts