విజయవాడ, ఆగస్టు 26,
కాంగ్రెస్ కు కొంత దేశ వ్యాప్తంగా అనుకూల వాతావరణం కన్పిస్తుంది. అయితే ఒంటరిగా పోటీ చేయలేకపోయినా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తుతోనే గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోదీపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను ఈసారి ఖచ్చితంగా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందుకోసం అన్ని రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రతి రాష్ట్రంలో లోక్ సభలో కొన్ని సీట్లను సొంతం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడుగింటి పోయింది. దాని ఓటు బ్యాంకు కూడా జగన్ ఎగరేసుకు పోవడంతో మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంది. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించడంతో ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజల ఆగ్రహం ఇంకా చల్లార లేదు. ప్రత్యేక హోదా హామీతో మరోసారి వారిని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.టీడీపీ బీజేపీతో కలవని పరిస్థిితి. తాము అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంటు స్థానాలు అత్యధికంగా ఇస్తే చాలన్న ఒప్పందంతో టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. అందుకే ఈ నెల చివరిలో పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం అవుతున్నారు. ఇందులో రాజకీయాలకు గత రెండేళ్ల నుంచి దూరంగా ఉంటున్న రఘువీరారెడ్డిని సయితం ఆహ్వానించారు.పాత నేతలను తిరిగి పార్లమెంటుకు పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో అది టీడీపీకి కూడా ఉపయోగపడుతుందని, పార్లమెంటు ఎన్నికలకు సీనియర్లు పోటీ చేస్తే టీడీపీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లాభిస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత చంద్రబాబు వద్దకు రాయబారం పంపాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. మొత్తం మీద కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం వీక్ గా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలకు దిగుతుంది.