గుంటూరు, ఆగస్టు 26,
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఒకప్పుడు 2018లో తెలంగాణలో వచ్చినట్టుగానే ముందస్తుకు ఏపీ సర్కారు కూడా మొగ్గు చూపుతోందా ? ప్రస్తుతం ప్రతిపక్షాలు, ప్రభుత్వ వ్యతిరేక మీడియా చేస్తున్న తీవ్ర వ్యతిరేక ప్రచారం నుంచి బయట పడేందుకు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారా? అంటే.. వైసీపీ వర్గాలు కూడా లోలోన అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలోకి జారుతోందని.. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేక మీడియా కూడా ప్రచారం చేస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేయాలో.. ఎన్ని ప్రకటనలు ఇవ్వాలో అన్నీ ఇస్తోంది. అయితే.. ఎక్కడా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించే పరిస్థితి వస్తోందని.. ఇదే జరిగితే.. ఏపీకి ఇంతకన్నా అవమానం లేదని.. ప్రతిపక్ష టీడీపీనేతలు ప్రచారం చేస్తున్నారు. అదేసమయంలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలను ఎండగడుతున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు నిధులను నేరుగా ఇస్తున్నందునే రాష్ట్రం అప్పుల పాలవుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. మరి ఈ పరిస్థితి నుంచి జగన్ బయటపడే మార్గం, ప్రతిపక్షాల నోటికి తాళం వేసే మార్గం.. ఒక్కటేనని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ సర్కారు కూడా ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలంటే.. ఎన్నికలకు వెళ్లాల్సిందేనని నిర్ణయించి.. ముందస్తుకు వెళ్లి విజయం దక్కించుకుంది. ఇదే సూత్రాన్ని ఏపీలోనూ అమలు చేయాలని.. ప్రజలు తనవైపు ఉన్నారో.. ప్రతిపక్షాల వైపు ఉన్నారో తేల్చుకునేందుకు ఇదే సరైన సమయమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తన సర్కారును మరో యేడాది టైంలో రద్దు చేసినా.. ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో తన సతీమణిని భారతిని కూడా నేరుగా రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. తన తర్వాత.. నెంబర్ 2 చేయాలనే ఆలోచన జగన్ చేస్తున్నట్టు ప్రచారం ఒకటి తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తేనే మంచిదని జగన్ అభిప్రాయ పడుతున్నట్టు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు ముందస్తుకు వెళ్లడం వల్ల.. వచ్చే పరిణామాలను కూడా అంచనా వేస్తున్నారని.. దీనిపై ఇంటిలిజెన్స్‌ను కూడా రెండు రోజుల కిందట అలెర్ట్ చేశారని తెలుస్తోంది. ఈ నివేదికను బట్టి.. జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు కనుక ముందస్తు వస్తే.. బలమైన వైసీపీనే తిరిగి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.