రాజమండ్రి, ఆగస్టు 25,
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో పదవులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను భర్తీ చేస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. గత ఎన్నికల తర్వాత ఖాళీ అయిన నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లుగా కొత్తవారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి లోక్‌సభకు పార్టీ నుంచి యువత, ఉన్నత విద్యావంతులను రంగంలోకి దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నరసారావుపేట ఎంపీ సీటుకు రాజధాని ఉద్యమంలో యాక్టివ్‌గా ఉంటోన్న రాయపాటి శైలజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఏలూరు నుంచి యువ పారిశ్రామికవేత్త పేరు రేసులో ఉంది. ఈ క్రమంలోనే రెండు గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న రాజమహేంద్రవరం లోక్‌సభ సీటు నుంచి రాజమండ్రి సీటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పేరు పార్టీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీని ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.గత ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆదిరెడ్డి భవానీ పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఏకంగా 30 వేల ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించి సంచలనం క్రియేట్ చేశారు. ఎర్రన్నాయుడు కుమార్తెగా ఉన్న క్లీన్ ఇమేజ్, ఇటు రాజమండ్రిలో ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న పట్టు ఇవన్నీ ఆదిరెడ్డి భవానీకి కలిసి వచ్చాయి. పైగా టీడీపీ నుంచి అసెంబ్లీలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమే కావడం విశేషం. అయితే పార్టీ వాయిస్‌ను ఆమె అంది పుచ్చుకోలేక పోతున్నారన్న చర్చలు ఇన్నర్‌గా ఉన్నాయి. అటు అసెంబ్లీలోనూ, బయటా ఆదిరెడ్డి భవానీ వాయిస్సే వినపడదు.ఇక నియోజకవర్గంలో పెత్తనం అంతా ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు చేసేస్తున్నారు. భవానీ పూర్తిగా చేయడానికేం లేదు. ఇక ఉన్నత విద్యావంతు రాలు కావడం, మహిళ కావడంతో ఆమె సేవలను లోక్‌సభలో వాడుకుంటే బాగుంటుందని కొందరు పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకు వెళ్లారు. చంద్రబాబు సైతం ఆమెను లోక్‌సభకు పోటీ చేయించేందుకే ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కమ్మ వర్గానికి చెందిన మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జగన్ ఇక్కడ బీసీ వర్గానికి చెందిన మార్గాని భరత్‌కు సీటు ఇవ్వడంతో పాటు బీసీ ఫ్యాక్టర్‌ను బాగా ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు.ఇక గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిన మాగంటి రూప తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తితో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు సైతం అదే బీసీ ఫ్యాక్టర్‌ను ఇక్కడ వాడాలని ఆదిరెడ్డి భవానీ పేరును తెరమీదకు తీసుకు వస్తోన్న పరిస్థితి. అయితే భవానీకి ఎంపీ సీటు ఇచ్చే విషయంలో రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మాత్రం ఇష్టం లేదని టాక్ ? ఇప్పటికే అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. పైగా రేపటి రోజు ఆదిరెడ్డి భవానీ ఎంపీగా, ఆమె భర్త వాసు సిటీ ఎమ్మెల్యేగా ఉంటే తన డామినేషన్‌కు ఎక్కడ బ్రేక్ పడుతుందో ? అన్న టెన్షన్ బుచ్చయ్యలో అప్పుడే మొదలైందని అంటున్నారు. ఏదేమైనా రాజమండ్రి టీడీపీ రాజకీయం అయితే రంజుగానే ఉంది.