విజయవాడ, ఆగస్టు 26,
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై అనేక సందేహాలు లేవనెత్తుతున్న అక్కౌంటెంట్ జనరల్ (ఎజి) కార్యాలయం తాజాగా కరోనా వైరస్ నివారణకు చేసిన ఖర్చుపైనా అనేక ప్రశ్నలు వేసింది. రాష్ట్రం చేస్తున్న అప్పులు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అక్కౌంటెంట్ జనరల్ (ఎజి) కార్యాలయం ఇప్పటికే అనేక ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నియంత్రణకు చేసిన ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలు అందచేయాలంటూ ఆ కార్యాలయం నుండి గురువారం మరో లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ వివరాలను నమోదుచేయడానికి ప్రత్యేకంగా ఒక నమూనాను కూడా పంపించింది. వైరస్ నివారణ, నియంత్రణ కోసం ఎంత నిధులు ఖర్చు చేశారు? వాటిలో రాష్ట్ర నిధులు ఎంత? కేంద్ర నిధులు ఎంత? ఆ నిధులు ఖజానాలో ఉంచి ఖర్చు చేశారా? బ్యాంకుల్లో ఉంచి ఖర్చు చేశారా? బ్యాంకులైతే రిజర్వు బ్యాంకు అనుమతిచ్చిన బ్యాంకులా.. ఇతర బ్యాంకులా వంటి వివరాలను ఎజి కార్యాలయం అడిగినట్లు తెలిసింది. ఇదే కాకుండా నిధులను ప్రభుత్వ ఖాతాల్లో ఉంచి ఖర్చు చేశారా? బయటి ఖాతాల్లో ఉంచి ఖర్చు చేశారా? బయటి ఖాతాల్లోనైతే అలా ఎందుకు చేశారు? మొత్తం ఖర్చులో పెట్టుబడి వ్యయం ఎంత? రెవిన్యూ వ్యయం ఎంత వంటి ప్రశ్నలు కూడా ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా ఒక్క వైద్య రంగానికే నెలకు సగటున 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మెడికల్ కిట్లు, పిపిఇ కిట్లు, క్వారైంటైన్ కేంద్రాల నిర్వహణ తదితర వాటికి భారీగానే నిధులు ఖర్చు అయ్యాయని అంటున్నారు. అదే సమయంలో ఇంటింటికి రేషన్, వైరస్ బారిన పడిన వారికి ఆర్థికసాయం తదితర అంశాలకు కూడా భారీగా ఖర్చు అయిందని చెబుతున్నారు. ఎజి కార్యాలయం నుండి వరుసగా అందుతున్న ఈ లేఖలు అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.