హైదరాబాద్, ఆగస్టు 26,
నియోజకవర్గాల పునర్విభజన పైన బీజేపీ కావాలనే వెనక్కు తగ్గింది. తమకు బలం లేని చోట మరింత బలహీనం కావడం ఇష్టం లేకనే నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడిప్పుడే ఆశలు మొదలయ్యాయి. ప్రధానంగా తెలంగాణ వంటి రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారంలోకి రావచ్చన్న అంచనా ఉంది. కేసీఆర్ పై వ్యతిరేకత వస్తే బీజేపీ ఖచ్చితంగా లబ్దిపొందుతుందన్నది ఆ పార్టీ నేతల భావన.
ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో లేవు. అక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తుతో పెట్టుకోవాల్సిందే. జనసేనతో చేసిన ప్రయోగం కూడా పెద్దగా ఫలించే అవకాశాలు లేవు. దీంతో అక్కడ టీడీపీ, లేదా వైసీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం, లేదంటే ఒంటరిగా పోటీ చేసి సమయం కోసం ఎదురు చూడటం తప్ప బీజేపీకి ఏపీలో మరో ఛాన్స్ లేదు.అయితే తెలంగాణలో కొంత కష్టపడితే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గ పునర్విభజన చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనన్న భావనలో బీజేపీ ఉంది. నిజానికి తెలంగాణలో ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాల్లోనూ పోటీకి దింపడానికి సరైన అభ్యర్థులు లేరు. గట్టిగా నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి బలమైన నాయకులున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుని మరింత తలనొప్పులు తెచ్చుకోవడమే కాకుండా కేసీఆర్ కు మరోసారి అవకాశం ఇచ్చినట్లవుతుందన్నది బీజేపీ నేతల భావన. అందుకే నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశామున్నప్పటికీ బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం దీనిని సుదీర్ఘ కాలం వాయిదా వేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడే దానిని బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంపు ఆధారపడి ఉంటుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. తెలంగాణను దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గాల పెంపును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలస్యం చేస్తుంది.