కరీంనగర్, ఆగస్టు 26,
అసలే అంతంత ఆదాయం.. రోజు రెక్కాడితేగాని డొక్కడాని పరిస్థితి.. తరతరాలుగా చేతివృత్తినే నమ్ముకుని జీవిస్తున్నప్పటికీ.. చేతినిండా పని దొరకదు. శ్రమించి చేసిన పనికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కరువు. పడిన కష్టానికి గిట్టుబాట ధర లభించదు. ఈ పరిస్థితికి ఇప్పుడు కరోనా కూడా జతకలిసింది. దీంతో మూలిగే నక్కపై తాటి పండు పడిన చ ందంగా చేనేత రంగం కార్మికుల పరిస్థితి త యారైంది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులతో నేతన్న బతుకు మరింత భారతమైంది. చేనేత రంగానికి జిఎస్‌టి విధానం ఒక గుదిబండగా మారింది. దీంతో ఆ రంగాన్ని నమ్ముకునే జీవిస్తున్న అరవై వేల మంది కార్మికుల పరిస్థితి అ గమ్యగోచరంగా మారింది. ఇందులో 40వేల మంది ప్రత్యక్షంగా ఆదారపడి జీవిస్తుండగా, మరో 20వేల మందికి పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారు. చేనేత రంగాన్ని కేంద్రం జిఎస్‌టి పరిధిలోకి తేవడంతో ఒక్కసారిగా పన్నుల భారం పెరిగిపోయింది. కేవలం చీరలపైనే కాకుండా చేనేత రంగానికి అనుబంధంగా ఉన్న వాటిపై కూడా జిఎస్‌టిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నూలుపై 5శాతం, రంగులపై 18శాతం, రసాయనాలపై 18 శాతం, తయారైన వస్త్రాలపై ఖరీదును బట్టి 5నుండి 12 శాతం జిఎస్‌టిని వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఒక్కో చీరపై 40నుంచి 50 శాతం వరకు జిఎస్‌టి భారం పడుతోంది. దీనిని తట్టుకోలేక నేత కార్మికులు వృత్తికి దూరమవుతూ ఇతర వృత్తులకు మళ్లుతుతన్నారు. ఇతర ఉత్పత్తులకు ఒకే రకమైన జిఎస్‌టి అమలవుతుంటే చేనేత వస్త్రాలపై విభిన్న రకాలగా జిఎస్‌టి అమలవుతోంది. అలాగే చిలపనూలు నుంచి రంగు, రసాయనాలపై తయారైన వస్త్రాలపై కూడా జిఎస్‌టిను విధిస్తున్నారు. అంటే చేనేత మగ్గంపై తయారు చేసే వస్త్రాలపై సుమారు 40నుంచి 50 శాతం వరకు జిఎస్‌టి భారం పడుతోంది.దీని ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం మేర మగ్గాలు మూలనపడ్డాయని తెలుస్తోంది. పన్నులు లేని చిలప నూలుపై తొలిసారిగా వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2002-03 బడ్జెట్‌లో 9.2శాతం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ విధించింది. దీంతో అప్పట్లో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమాలు జరిగాయి. చేనేత కేంద్రాలలో నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తన నిర్వహించారు. అప్పటి చేనేతల ఉద్యమ ఫలితంగా 2004లో అధికారంలోకి వచ్చిన యుపిఎ ప్రభుత్వం చిలపలనూలుపై విధించిన ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. అదే సమయంలో జూట్ మిల్లులు, పవర్‌లూమ్ రంగాలకు కేంద్రం వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూండడంతో చేనేత రంగం తీవ్ర సంక్షోభం వైపుకు దారితీసింది. మిల్లు, పవర్‌లూమ్ రంగాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలు చేనేత రంగం ఉత్పత్తి చేసిన వస్త్రాల కన్నా తక్కువ ధరలకు లభిస్తుండడంతో సామాన్య ప్రజలు మిల్లు, పవర్‌లూమ్ వస్త్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరమగ్గాల రంగం పోటీని తట్టుకోలేక చేనేత రంగం కుదేలవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో నేపథ్యంలో మిల్లు, పవర్‌లూమ్ రంగాలు ఉత్పత్తిచేసిన వస్త్రాలు సామాన్యులకు అందుబాటు ధరలలో ఉంటే చేనేత రంగం ఉత్పత్తులు ఎగువ మధ్య ఉన్నతవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇప్పటికే పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో చేనేత రంగం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.చేనేత రంగంలో వస్త్ర తయారీకి కూలీ కూడా గిట్టుబాటు కాక ఇతర రంగాలకు వలసలు పోతున్నారు. ఉపాధికోసం చేనేతలు ఇతర ప్రాంతాలకు వలస సపోతున్నారు. కాగా మోడీ నేతృత్వంలో కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం చిలపనూలుపై మరోసారి 5శాతం జిఎస్‌టి విధించడంతో గోరుచుట్టపై రోకటిపోటులా పరిణమించింది. దీంతో పడిన కష్టానికి సరైన ఆదాయం రాక నేతన్నల బలవన్మరణాలు పెరిగాయి. ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం. దేశంలో తలసరి ఆదాయం రూ.1.25 లక్షల నుంచి రూ.1.30లక్షల వరకూ చేరింది. కానీ చేనేత కార్మికుడి ఆదాయం మాత్రం అందులో నాలుగో వంతే . చేనేత కార్మికుడి ఏడాది ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.31 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.29 వేలు మాత్రమే. ఈ పరిస్థితుల్లో వారి ఆదాయం పెంచే విధాన నిర్ణయాలు తీసుకోకుండా జిఎస్‌టి భారం మోపి ఆ రంగాన్ని మరింత నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.ఇక చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘ముద్ర’ లోన్లు ఏటా 6శాతం వడ్డీతో రూ.2లక్షల వరకూ ఇస్తామని కేంద్రం ప్రకటించినా బ్యాంకర్లు మాత్రం ఇవ్వడంలేదు. చేనేతలకు జిఎస్‌టి అమలు తర్వాత నూలు బారుకు రూ. 100 పెరిగింది. జిఎస్‌టికి ముందు బారుకు రూ.940లు ఉన్న ధర జిఎస్‌టి అమలు తర్వాత రూ. 1040లకు పెరిగింది. పట్టు కిలో జిఎస్‌టికి ముందు రూ. 4300 ఉండగా జిఎస్‌టి తర్వాత రూ. 4800కు పెరిగింది. దీంతో పట్టు చీర జిఎస్‌టికి ముందు రూ. 2800, అమలు తర్వాత రూ. 3000లకు పెరిగింది. బిట్‌సెల్ఫ్ చీర జిఎస్‌టికి ముందు రూ. 1800, దాని అమలు తర్వాత రూ. 1950లకు పెరిగింది. అలాగే కుప్పడం జిఎస్‌టికి ముందు రూ. 3750, అనంతరం రూ. 4050లకు పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి జాతీయ ప్రణాళికా సంఘ సమావేశంలో కుటీర పరిశ్రమలపై పన్ను విధించరాదని నిర్ణయం తీసుకున్నారు. దేశ మనుగడలో కుటీర పరిశ్రమల ఉనికిని పదిలపరిచే దిశలో ప్రణాళిక సం ఘం కీలకమైన నిర్ణయం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఎలాంటి పన్నులు విధించరాదని అప్పట్లో సిఫారసు చేసింది. చేనేతకు సంబంధించి నూలు, వస్త్రాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ పన్ను విధించరాదని స్పష్టంచేసింది. కాని ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిలోకి చేనేత రంగాన్ని తీసుకొచ్చి వారి జీవితాలను రోడ్డుమీదకు తీసుకొచ్చినట్లు అయింది.ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 250 కోట్ల విలువ గల చేనేత నిల్వలు పేరుకుపోయాయని తెలుస్తోంది. కొనేవారు, నేయించే వారు లేక మగ్గాల శబ్ధం ఆగిపోయింది. రాట్నం తిరగనంటోంది. ఆసులన్నీ అటకెక్కాయి. రంగులద్దే పాత్రలన్నీ వెలిసిపోతున్నాయి. షట్టర్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ప్రతి చేనేత కార్మికుడి ఇంట ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. షావుకార్లు పని చెప్పడం లేదు. నేసిన చీరలను సేట్లు కొనడం లేదు. చేసే ఓపిక ఉంది. కొత్త డిజైన్లు రూపొందించగల నైపుణ్యం ఉంది. కానీ వరుస సంక్షోభాలు చేనేత రంగంపై పంజా విసురుతున్నాయి. జిఎస్‌టి, లాక్‌డౌన్.. ఇలా వరుస విపత్తులతో చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా నల్లగొండ, యాదాద్రి, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో చేనేత రంగం కుదేలైంది. కంటి తుడుపులా ఆన్‌లైన్ ద్వా రా 10 నుంచి 20 శాతం మేరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.చేనేతన్నల దుస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం చలించింది. వారి సంక్షేమం కోసం ప్రభుత్వ పక్షాన చేయాల్సిన కార్యక్రమాలను చేపడుతోంది. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. చేనేతన్నలకు చేతినిండా పని కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం నేయిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ రోజున చీరను కానుకగా ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్ధి, విద్యార్ధులకు అవసరమైన యూనిఫామ్స్‌ను కూడా చేనేతన్నలకు ఆర్డర్లను ఇస్తోంది. వారిని పూర్తిస్థాయిలో ఇబ్బందులను నుంచి బయటపడ వేసే సమయంలో కరోనా వ్యాధి మరోసారి వారికి ఉరితాడులా మారింది. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ వల్ల చాలా రోజులుగా మగ్గాలకు పనిలేకుండా పోయింది. దీంతో చేనేతన్నల పరిస్థితి మరింతగా దిగజారడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఇటీవల రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా చేనేత, టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రెండేండ్లపాటు చేనేతవస్త్రాలపై పూర్తిస్థాయి జిఎస్‌టి మినహాయింపులను పరిశీలించాలని సూచించారు.ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాలన్నారు. చేనేత, జౌళిరంగంలో పనిచేస్తున్నవారికి కనీసం ఆరునెలలపాటు 50 శాతం వేతనం ఇవ్వాలని, పరిశ్రమకు అవసరమైన దీర్ఘకాలిక రుణాలను అందించాలన్నారు. మూడు నెలలపాటు పిఎఫ్, ఈఎస్‌ఐ తదితర వాటిని కేంద్రమే భరించాలన్నారు. ప్రస్తుత రుణాలపై వడ్డీమాఫీ లేదా ఏడాదిపాటు మారటోరియం ప్రకటించాని కోరారు. అవసరమైతే అదనంగా మరిన్ని రుణాలు ఇవ్వాలన్నారు. రుణాల చెల్లింపులో ఆలస్యమైతే మూడునెల ల్లో ఎన్‌పిఎలుప్రకటించే నిబంధనలను ఆరునెలల నుంచి సంవత్సరం వరకు పొడిగించాలని మంత్రి కెటిఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవిస్ పథకాన్ని యార్న్, ఫ్యాబ్రిక్‌లకు విస్తరించాలన్నారు. ఇలా ప్రభుత్వ పక్షాన ఆయన పలుమార్లు చేనేత కార్మికుల దుస్థితిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.