ప్రభుత్వ ఉద్యోగులు , స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పిలుపు
నెల్లూరు
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. గురువారం శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమన్వయ కేంద్రాన్ని (జీవో- ఎన్జీవో కోఆర్డినేషన్ సెంటర్) కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్నారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలో 70 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్, జగనన్న పచ్చ తోరణం పథకాల అమలులో స్వచ్ఛంద సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. మారుమూల గ్రామాల్లో కూడా కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా పనిచేసి జిల్లాను కరోనా రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా
జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కేంద్రాన్ని కలెక్టర్ ప్రత్యేక చొరవతో నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకొని, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని కోరారు. అనంతరం పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి ధనలక్ష్మి, డిఆర్డిఎ పిడి సాంబ శివారెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి, స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ కే. సహదేవయ్య, కమాండింగ్ ఆఫీసర్ యుగంధర్ రెడ్డి, సెట్నల్ సీఈవో పుల్లయ్య, పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.