YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లక్షల కోట్ల అప్పులు....

లక్షల కోట్ల అప్పులు....

విజయవాడ, ఆగస్టు 27,
అవును ఏ ప్రభుత్వం అయినా అప్పు చేస్తే ఆ బాధ బాధ్యత ప్రజలదే. కోట్లాది మంది జనాలు కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఒక విధంగా పాలకులు ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాలి. వారే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలి. కానీ కాలం గడిచే కొద్దీ రాజకీయ స్వార్ధమే రాజ్యమేలుతోంది. మన వరకూ ఓకే. ఆ తరువాత ఎవరు ఏమైపోతే మనకేం అన్న తీరున పాలకులు సంకుచితంగా ఆలోచిస్తున్నారు. అందుకే దేశాన్ని ఏలే వారు కానీ, రాష్ట్రాలు పాలించే వారు కానీ ఈజీగా లక్షల కోట్ల అప్పులు చేసేస్తున్నారు. తమ అయిదేళ్ల పాలనలో యాభై ఏళ్ల రుణ భారాన్ని తెచ్చి జనం నెత్తిన పెడుతున్నారు. ఇక అప్పు అంటే ఏపీ అన్న తీరుగా ఇపుడు ఉంది.ఏపీకి పెద్దన్న, సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతగానే ఒక ప్రశ్న అడుగుతున్నారు. జగన్ రెండేళ్ల పాలనలో రెండు లక్షల కోట్ల మేర అప్పులు చేశారని, ఆ అప్పులు దేనికి ఖర్చు పెట్టావంటూ గట్టిగానే గదమాయిస్తున్నారు. అంత అప్పు తెచ్చి చేసిన అభివృద్ధి ఏంటి అని కూడా నిగ్గదీస్తున్నారు. సరే తెచ్చిన అప్పుల్లో లక్ష కోట్లకు పైగానే జగన్ సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అది కళ్ళకు కనిపిస్తోంది. మిగిలినది ఏం చేశారు అన్నది కూడా ప్రభుత్వ పెద్దలు వివరిస్తే చంద్రబాబుకే కాదు, అయిదు కోట్ల జనాలకు కూడా పక్కాగా క్లారిటీ వస్తుంది.ఇక జగన్ని విపక్ష నేత హోదాగా నిలదీస్తున్న చంద్రబాబు తన హయాంలో మూడు లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పులు తెచ్చారన్నది మరుస్తున్నారు. మరి ఆయన తెచ్చిన అప్పులకు కూడా చిట్టా పద్దులు ఉండాలి కదా. ప్రతీ పైసా లెక్క చెప్పి జనాలకు జవాబుదారీగా ఉండాలి కదా. మరి చంద్రబాబు అలాంటి పని చేశారా. బాబు లెక్క చెప్పారా. కనీసం ఒక అంచనాకు అయినా దీనీకి ఇంత అని ఖర్చు చేసినట్లుగా బోల్డ్ గా స్టేట్మెంట్ అయినా ఇచ్చారా. అంటే చంద్రబాబు ఖర్చు చేస్తే పరమార్ధం, జగన్ అప్పు తెస్తే మాత్రం స్వార్ధమనా. ఇదేమి లాజిక్కు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని ఎవరైనా అంటే చంద్రబాబు ఏం చెబుతారో.జగన్, చంద్రబాబే కాదు, దేశాన్ని ఏలుతున్న మోడీ కూడా ప్రజలకు లెక్క చెప్పాల్సిందే. ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్ము. అప్పు అయినా ఆస్తి అయినా వారి పేరు చెప్పి ఖర్చు పెడుతున్నపుడు తెలుసుకోవాల్సిన అవసరం జనాలకు ఉంది. ఎవరూ అడగడంలేదు కదా అని ఊరుకోవడం తగని పని, అది రాజనీతి కూడా అనిపించుకోదు. ఇక ఎవరు అప్పు తెచ్చినా పేదలు, శ్రామికులు చిరుద్యోగులు నిరుద్యోగులతో నిండిన ఈ దేశంలోని నూటికి ఎనభై శాతం కట్టే పన్నుల మీదనే ఆ అప్పులు తీర్చాలి. అందువల్ల అప్పు తేవడం తప్పు కాదు, వాటికి ఎలా ఖర్చు చేశాం, ఏమి అభివృద్ధి సాధించామని చెప్పడమే గొప్ప. అలా చేసిన వారే సిసలైన నాయకులుగా ఉంటారు.

Related Posts