హైదరాబాద్, ఆగస్టు 27,
ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. అయితే, అందరు అనుకున్నట్లుగా ఆయన సొంత పార్టీ పెట్టకుండా బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ‘అక్షరం-ఆర్థికం-ఆరోగ్యం’ అనే నినాదంతో బడుగులకు రాజ్యాధికార సంకల్ప సభ నిర్వహించారు. మొత్తంగా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలని, ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్టూ డైరెక్ట్‌గానే విమర్శలు చేశారు ప్రవీణ్.ఈ క్రమంలోనే దళిత, గిరిజన, ఆదివాసీలపై చర్చ షురూ అయింది. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ స్కీమ్ వచ్చింది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు దళిత, గిరిజనులు, ఆదివాసీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఈ నేపథ్యంలోనే ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలు నిర్వహించడం షురూ చేశాడు. ఆయా వర్గాలను చైతన్యం చేసి తమ పార్టీ వారి కోసం కృషి చేయబోతున్నదనే సంకేతాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ రాజకీయాల్లో ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ప్రవీణ్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నపుడు దళిత, గిరిజనలు జ్ఞానమార్గంలో నడవాలని సూచించారు.ఇక రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయ అధికారం కోసం పోరాడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయ వర్గాల ప్రజల్లో చైతన్యం వచ్చే చాన్సెస్ ఉండగా, రాజకీయ పార్టీలు ఆ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితులన్నిటినీ నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ఎఫెక్ట్ బాగానే ఉందని అభిప్రాయం వినబడుతోంది. అయితే, ప్రవీణ్ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తారనే అభిప్రాయం బీఎస్పీ వర్గాల్లో వినిపిస్తున్నది.