హైదరాబాద్, ఆగస్టు 27,
సుదీర్ఘకాల విరామం తర్వాత టీఎస్‌ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ నియామకం జరిగింది. 2018 జులైలో అప్పటి ఎమ్‌డీ ఎమ్‌వీ రమణారావు ఉద్యోగ విరమణ పొందాక...ఆర్టీసీ అంపశయ్యపైకి చేరింది. సోమారపు సత్యనారాయణ తర్వాత చైర్మెన్ నియామకమూ లేదు. ఎట్టకేలకు ఉమ్మడి రాష్ట్ర సంస్కృతే స్వరాష్ట్రంలోనూ అమల్లోకి వచ్చినట్లైంది. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌ను పూర్తికాలపు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఎమ్‌డీలుగా పనిచేసిన ఐపీఎస్‌లు ఆ తర్వాత రాష్ట్ర డీజీపీలుగా నియమితులైన చరిత్ర ఉంది.రాష్ట్ర విభజన తర్వాత టీఎస్‌ఆర్టీసీలో అనేక మార్పులు.. ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తే...ఉద్యోగం ఉంటే చాలు అనే దైన్యస్థితికి పరిస్థితి దిగజారింది. ప్రతినెలా కార్మికులు జీతాలకోసం ఎదురుచూపులు. పెరిగిన పనిభారాలు. జీతం సొమ్ములోంచి పొదుపు చేసుకున్న ఈపీఎఫ్, సీసీఎస్ సహా అనేక ఆర్థిక ప్రయోజనాల కోసం వెంపర్లాడే దుస్థితి. రిటైర్ అయినా మూడేండ్లుగా అందని బెనిఫిట్లు. చివరకు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి అధికారి మొదలు క్రిందిస్థాయి ఉద్యోగి సైతం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం బస్‌భవన్ ముందు ప్లకార్డులు పట్టుకొని 'దేహీ' అనే దైన్యస్థితి. ఇప్పుడున్న బస్సుల్లో 50 శాతం డొక్కు బస్సులే. కొత్త బస్సుల ఊసే లేదు. రిక్రూట్‌మెంట్ల సంగతి దేవుడెరుగు...తాజాగా సంస్థలో నాలుగువేలమంది ఉద్యోగులు అదనంగా ఉన్నారనే ప్రచారం. స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేస్తారనే చర్చ.ఇవన్నీ ఒకెత్తు అయితే ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ అసలు సమస్య. దీనిపై కొత్త ఎమ్‌డీ సజ్జనార్ ఎలా వ్యవహరిస్తారనేదే ఇప్పుడు కార్మికులు చర్చిస్తున్న హాట్ టాపిక్. ఆర్మూర్, కరీంనగర్‌లో ఆర్టీసీకి చెందిన ఖాళీస్థలాల్లో 'నిర్మాణం- నిర్వహణ-అప్పగింత' (బీఓటీ) పద్ధతిలో వ్యాపార సముదాయాలు నిర్మించారు. ఆర్టీసీకి ఎలాంటి లీజు సొమ్ము చెల్లించట్లేదు. ఇక్కడ స్థానిక టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బినామీలే తిష్టవేశారనే ప్రచారం ఉంది. ఇక నిర్మల్‌లో ఆర్టీసీ స్థలాన్ని కాపాడుకోవడం కోసం అక్కడి డిపో మేనేజర్ అధికారయంత్రాంగంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. కార్మిక సంఘాలన్నీ ఆయనకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులది మరో గోస. వారికి బకాయిలు చెల్లించలేదు. ఆర్టీసీ కార్గో ఏర్పాటు చేసినా, ఆశించిన స్థాయిలో ఆర్జన లేదు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన రవాణా, బట్వాడా సేవల్ని కూడా ఆ విభాగం పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నది. అరకొరే తప్ప ఆయా శాఖలతో పూర్తిస్థాయి రవాణా ఒప్పందాలు లేవు.