జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
విజయవాడ, ఆగస్టు 27,
ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఎయిడెడ్ తొలగిస్తే విద్యార్థులు నష్టపోతారంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు లాయర్ పేర్కొన్నారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది.కోర్టు ఈ అంశంపై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత కోర్టు ఆదేశించింది. పూర్తి విచారణ చేపట్టే వరకు విద్యార్ధులకు నష్టం జరగకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఎయిడ్ నిలిపివేయడం, స్వాధీనంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. విద్యా సంస్థల స్వాధీనం నోటిఫికేషన్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.