తిరుమలలో ప్రారంభమైన సాంప్రదాయ భోజనం
తిరుమల, ఆగస్టు 27,
కలియుదైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీతో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తాయి. రోజూ వేలాదిమంది స్వామివారి భక్తులు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామివారి ఉచిత ప్రసాదం అందిస్తూ.. వీరందరి ఆకలిని టిటిడి తీరుస్తుంది. అయితే తాజాగా టిటిడీ అధికారులు కొండపై సాంప్రదాయ భోజనం కార్యక్రమం ప్రారంభించారు.తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. 'సంప్రదాయ భోజన' కార్యక్రమాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవనంలో ప్రారంభించింది. ఇప్పటికే దేశీయ గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.. అదే విధంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో అన్నప్రసాదం తయారీకి రెడీ అవుతున్నారు. దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో అన్నప్రసాదాలు తయారు చేసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో వడ్డించారు. అన్నపాదంలో అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. ఇలా మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు. దేశీయ ఆవునెయ్యి, బెల్లం, గానుగ నూనెతో వంటలు వండి భక్తులకు వడ్డించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కుల్లకారు బియ్యంతో ఇడ్డీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మ తయారు చేసి అందించారు. అన్న ప్రసాదంలో శరీరానికి కావాల్సిన పోషకాలు, సూక్ష్మ క్రిములను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఈ ఆహారం తీసుకోవడం వలన మన ఆరోగ్యంతో పాటు రైతు సంక్షేమం, గో సంక్షేమం ఉంటుందని చెప్పారు. ఈ సంప్రదాయ భోజన కార్యక్రమాన్నిసెప్టెంబర్ 8 వ తేదీ వరకూ అమలు చేసి.. భక్తుల అభిప్రాయాలను, సూచనలను స్వీకరించనున్నారు. అనంతరం ఎక్కడ ఏయే ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాట్లు చేయాలనే తుది నిర్ణయం తీసుకోనున్నారు టీటీడీ అధికారులు. ఈ సాంప్రదాయ భోజనాన్ని పూర్తి స్థాయిలో మరో 20 రోజుల్లో భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నారు.