ఇద్రుడు దేవరాజు. అహంకారం ఎక్కువ అవడం వల్ల ,శంకర అంశమయిన దూర్వాసమహర్షి ని అవమానం చేసి ఆయన కోపానికి గురి అయ్యాడు. భూలోకం లో మానవశరీరం తో పుట్టమనో..రాయిగా పడి ఉండమనో ..శాపం ఇవ్వలేదు దూర్వాసమహర్షి.ఏకంగా త్రైలోక్య సామ్రాజ్య లక్ష్మి నిన్ను వదిలిపోతుంది అని శపించేశారు.ఇంకేముంది...లక్ష్మి లేని చోట కళ, కాంతి ఉండవుగా. జగత్తు సొంపు అంతా పోయింది. దిక్కు లేని వారికి ఆ జగన్నాథుడే దిక్కు అని బ్రహ్మ తో కలిసి ఆ స్వామిని ప్రార్ధించేరు అందరూ. మహానుభావుల ఆగ్రహం కూడా మంచి పని కోసమే.క్షీరసాగర మధనానికి దూర్వాసుని కోపం నాంది అయ్యింది.మందరమును కవ్వం గా,వాసుకిని తాడుగా కట్టి పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు దేవతలు, దానవులు.మహావిష్ణువు కూర్మ రూపి అయి ఆ పర్వతం క్రిందకి చేరాడు.ఆ క్షీరసాగరంలో నుండి ఐరావతం కామధేనువు,పారిజాతం,అప్సరగణము,ధన్వంతరి మొదలయిన వారు బయటకి వచ్చారు.
అప్పుడు.....
"" తొలకారు మెరుగు కైవడి, తళతళ మని మేను మెరయ.. ధగధగ మనుచున్ గలుముల నీనెడు చూపుల.."" పద్మాసనయై, పద్మహస్త అయిన శ్రీదేవి ఆవిర్భవించింది.తనకు సరిఅయిన వాని కోసం వెతికింది.
""చందన శీతలుండు...శుద్ధ కారుణ్యమూర్తి..విమలుండు"" ఇతడే మంచి భర్త అనుకొంటూ ఆమె హరి వక్షస్థలాన్ని అలంకరించింది.ఆ విష్ణువక్షస్థలవాసిని ని ప్రార్ధించి ఇంద్రుడు తన స్వర్గ సామ్రాజ్యాన్ని తిరిగి పొందేడు. అప్పుడు ఆయన చేసిన లక్ష్మీ స్తుతియే మనం ఇప్పుడు వినబోయే శ్రీ స్తుతి.ఇంద్రుడు ఆ శ్రీమహాలక్ష్మి ని ప్రార్ధిస్తూ ఈ స్తుతితో ఎవరు అయితే నిన్ను కీర్తిస్తారో వారి వద్ద నువ్వు చిరకాలం ఉండాలి అంటూ కోరిక కోరేడట.జగత్తుకు కొత్త ప్రాణం వచ్చింది..
ఆ చక్కని తల్లి, చల్లని చూపులు మనని కూడా చేరాలని విష్ణుపురాణం లో ప్రధామాంశం నవమ అధ్యాయం లో చెప్పబడిన శ్రీస్తుతి ని మన స్వామి వారితో కలిసి అందరం చదువుదాం...