YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైదరాబాద్ పై హుజూరాబాద్ ఎఫెక్టు

హైదరాబాద్ పై హుజూరాబాద్ ఎఫెక్టు

హైదరాబాద్, ఆగస్టు 28,
మహానగర పాలక సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. ఏదేమైనా రోజుకి కనీసం రూ. 2 కోట్లు లేనిదే రొటీన్ మెయింటెనెన్స్, తీసుకున్న అప్పులకు రోజుకి రూ. కోటి వడ్డీ చెల్లించలేని గడ్డు పరిస్థితిలు దాపురించాయి. జీహెచ్ఎంసీ ఆర్థిక వనరుల్లో ప్రధానమైంది ఆస్తి పన్ను. నగరంలోని 30 సర్కిళ్లలో ఈ పన్నును క్షేత్ర స్థాయిలో వసూలు చేసేందుకు ఉన్న 350 మంది బిల్ కలెక్టర్లు , 150 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం పన్ను వసూళ్లను పక్కనబెట్టి వ్యాక్సినేషన్ విధులు, కమర్షియల్ కారిడార్లలో భవనాల వినియోగం, అనుమతులు, ఆస్తి పన్ను, రీ అసెస్‌మెంట్ వంటి విధులు నిర్వహిస్తున్నారు.దీంతో పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. బల్దియాలోని వివిధ విభాగాల్లో పర్మినెంట్, ఔట్ సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 28 వేల పై చిలుకు మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికి ప్రతి నెల రూ. 110 కోట్ల వరకు జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సి వస్తోంది. స్వీపర్లు మినహా మిగిలిన వారందరికి పీఆర్సీని అమలు చేస్తే ఈ భారం అదనంగా మరో ముప్పై శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఖజానా నిండుకున్న కొద్దీ వివిధ రకాల బిల్లులు, రోజువారి నిర్వహణ ఖర్చులు వంటివి చెల్లించటం వల్ల నెలాఖరులో జీతాలు చెల్లిద్దామనునుకునే సమయానికి ఖజానా ఖాళీ అవుతోంది.దీంతో అధికారులు వివిధ దశల వారీగా సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు. కొందరు పెన్షనర్లకు, సిబ్బందికి ఈ నెల 20 వరకు కూడా జీతాలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. బల్దియాలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నాటి నుంచి సర్కారు సిబ్బంది జీతభత్యాల కోసం ప్రతి నెల రూ. 78 కోట్లను వివిధ ఖాతాల కింద చెల్లిస్తోంది. కానీ, కొద్ది రోజులుగా సర్కారు ఖజానా కూడా ఖాళీ కావటంతో ఆగస్టు మాసంలో రావల్సిన నిధులు సర్కారు ఇవ్వలేకపోయిందని సమాచారం. దాంతో ఈ నెల జీతాల చెల్లింపు క్లిష్టంగా మారింది.హుజూరాబాద్ బై పోల్ ఎఫెక్టు నేరుగా జీహెచ్ఎంసీ పై పడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రూ. 2వేల కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు మరికొన్ని అవసరాలకు మరో రెండు వేల కోట్లను విడుదల చేయటంతో ఖజానా ఖాళీ అయింది. ఆగస్టు మాసంలో బల్దియాకు ఇవ్వాల్సిన జూలై, ఆగస్టు మాసాలకు చెందిన రూ. 156 కోట్ల నిధులు ఇప్పట్లో సర్కారు ఇచ్చే అవకాశాల్లేనందున బల్దియా అధికారులు ప్రత్యామ్నాయమేమిటి? అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెల్సింది.జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నా, అధికారులు వాటిని వసూలు చేసుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వందల కోట్లలో పేరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల ఆస్తి పన్ను, దీంతో పాటు ఎంటర్ టైమ్ మెంట్ ట్యాక్స్ తో పాటు గ్రేటర్ పరిధిలో జరిగే వాహానాల రిజిస్ట్రేషన్, మోటారు వెహికల్ ఛార్జెస్ తో పాటు భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీలో 75 శాతం ఆదాయం బల్దియాకే రావల్సి ఉన్నా, చెల్లింపుల నిమిత్తం సర్కారుకు ప్రతిపాదనలు పంపేందుకు కూడా అధికారులు సాహసించటం లేదు.పైగా గ్రేటర్ పరిధిలో బస్సులను నడుపుతూ ఆదాయం సమకూర్చుకుంటున్న ఆర్టీసీ కూడా బల్దియాకే నిధులను చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కమిషనర్ గా వ్యవహారించినపుడు ఏటా రూ. 250 కోట్లను ఆర్టీసికి అప్పనంగా మూడేళ్ల పాటు చెల్లించటం, ఎస్ఆర్ డీపీ కింద ఒకేసారి వేల కోట్ల రూపాయల పనులు చేపట్టడం వల్లే నేడు సంక్షోభం తీవ్రమైందని అధికారులంటున్నారు.

Related Posts