చెన్నై ఆగష్టు 28
కేంద్రం తీసుకొచ్చిన కొత్త మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం సభ కొలువుదీరగానే తొలుత అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్టాలిన్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి.తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంకే స్టాలిన్ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం వాటిని ఏకపక్షంగా ఆమోదించిందని అన్నారు. ఈ మూడు చట్టాలు దేశంలో వ్యవసాయ వృద్ధికి లేదా రైతులకు సహాయపడవని చెప్పారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాకుండా నిరోధించాలంటే ముందుగా ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.తమిళనాడు చరిత్రలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగం, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను తన ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. రైతులు చేస్తున్న శాంతియుత ఆందోళనలకు మద్దతుగా ఈ తీర్మానం చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. అదేవిధంగా, గత ఏడాదిగా ఆందోళన చేస్తున్న రైతులపై దాఖలైన అన్ని రకాల కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.తమిళనాడు ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగానే బీజేపీ, ఏఐఏడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఏఐఏడీఎంకే డిప్యూటీ లీడర్ పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల్లోని చెడును చెప్పిన ముఖ్యమంత్రి స్టాలిన్.. వాటిలోని మంచి అంశాలను కూడా చెప్తే సంతోషించేవారమన్నారు. కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకే తీర్మానం తీసుకొచ్చామని డీఎంకే సభ్యులు చెప్తున్నారు.