డ్రోన్ కెమేరాల ద్వారా రాష్ట్రంలోని రహదారుల స్థితిగతులు పరిశీలించాలి. ఆ సమాచారాన్ని వినియోగించుకోవడం ద్వారా రహదారుల నిర్వహణ చేపట్టాలి. రహదారుల నిర్మాణంలో నేల తీరు, వర్షపాతం, ట్రాఫిక్ రద్దీ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. శనివారం నాడు అయన రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారుల మొత్తం పొడవు 53,403 కి.మీ. జాతీయ రహదారులు 6,401 కి.మీ వుండగా రాష్ట్ర రహదారులు 14,722 కి.మీ, ప్రధాన జిల్లా రహదారులు 32,280 కి.మీ వున్నాయి. అలాగే, జిల్లా రహదారుల్లో 4 వరుసల రహదారులు 131 కి.మీ, వుండగా రెండు వరుసల రహదారులు 2,671 కి.మీ, ఒక వరుస వున్న రహదారులు 28,530 కి.మీ వున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ రహదారుల కోసం 2014 నుంచి ఇప్పటివరకు జరిపిన బడ్జెట్ కేటాయింపులు రూ. 2,748.21 కోట్లు, ఖర్చు చేసిన మొత్తం రూ. 2,103.34 కోట్లు అని తెలిపారు. 2014-15లో ఖర్చు చేసినది రూ. 459.17 కోట్లు, 2015-16లో రూ. 425.97 కోట్లు, 2016-17లో రూ. 572.11 కోట్లు, 2017-18లో రూ. 646.09 కోట్లు ఖర్చు చేసింది. 2018-19లో రూ. 948 కోట్ల కేటాయింపులు వున్నాయి. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు రహదారులను అనుసంధానించడం, వచ్చే ఐదేళ్లలో నాలుగు వేల కి.మీ. ప్రధాన జిల్లా రహదారుల విస్తరణ చేపట్టడం, శిధిలావస్థకు చేరిన 120 వంతెనలను పునర్నిర్మించడం, రహదారి భద్రతా చర్యల్లో భాగంగా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్వహణ చేపట్టడం, 2021-22 కల్లా రాష్ట్రంలోని 1,810 కి.మీ రహదారులను రూ. 1,580 కోట్లతో బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా శాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవాలి. రహదారుల పక్కన వున్న పిచ్చిమొక్కలను, పొదలను తొలిగించాలి. నీరు నిలిచిపోయి రోడ్లు పాడవ్వకుండా అవసరమైన చోట డ్రైనేజీలు నిర్మించాలని అన్నారు. రాష్ట్రంలో రహదారులపై గుంతలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేలా నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని అన్నారు. సీసీ కెమేరాలతో రహదారుల నిర్మాణం పర్యవేక్షణ జరగాలి. నత్తనడకన రహదారుల నిర్మాణం చేపట్టే సంస్థలపై చర్యలు తీసుకుంటాం. నిర్దేశిత సమయానికి రోడ్ల నిర్మాణం చేయకుంటే నిర్మాణ సంస్థలను బ్లాక్లిస్టులో పెడతామని హెచ్చరించారు.