అనంతపురం, ఆగస్టు 30,
రాయదుర్గం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. అసైన్డ్,చుక్కల భూములు, వంకపోరంబోకు భూములను ఎంచుకుని ఇష్టానుసారంగా తవ్వి మట్టిని మెక్కేస్తున్నారు.కర్ణాటకకు చెందిన వ్యాపారులతో టిప్పర్ మట్టిని రూ.1,500 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అలా రోజుకు రూ.75 వేల నుంచి లక్షకు పైబడి అక్రమార్జన చేస్తున్నాడు.ఈ తతంగం గత సంవత్సర కాలంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. డి.హీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం ఐరన్ ఓర్‌కు దేశంలోనే పేరుగాంచింది. గత సర్పంచ్ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన వెంకటేశులు విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కూడా ఆ పార్టీలో చేరాడు. గ్రామ ప్రథమ పౌరుడిగా, పెద్దమనిషిగా ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఆదాయం కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. చిదానందస్వామి, బసవరాజు, రాజ, రామి, తిప్పేస్వామి, మాజీ సర్పంచ్ తిమ్మప్ప తదితర పది మంది సభ్యులతో గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని మట్టి దందాకు తెరలేపాడు. ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ పక్కన, కొత్త సుగ్గులమ్మ దేవాలయ సమీపాన సర్వే నంబర్ 124ఏ లో ఉన్న నాలుగెకరాల వంకపోరంబోకు భూమిని ఎంచుకున్నాడు. నిరంతరం తన గ్యాంగ్‌తో నలువైపులా నిఘా పెట్టించాడు. రాత్రి 9 నుంచి తెల్లవారుఝామున 4.30 గంటల వరకు హిటాచీతో ఇష్టారాజ్యంగా మట్టితవ్వకాలు చేయిస్తున్నాడు. రోజుకు 50 నుంచి 80 ట్రిప్పుల వరకు మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదే ప్రదేశంలో గతంలో నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా మట్టి తవ్వకం పనులు చేసినట్లు చూపి వెంకటేశులు రూ.20 లక్షలు నొక్కేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మట్టి తవ్వకాలు జరిపే ప్రదేశానికి ఎవరైనా వెళితే టిప్పర్లతో ఢీకొట్టించి మట్టుపెట్టే యత్నాలు కూడా గతంలో జరిగాయని బాధితులు వాపోతున్నారు. టిప్పర్ లైట్లు బంద్ చేసి వెనుక నుంచి వచ్చి గుద్ది చంపేందుకు కూడా వెనుకాడబోరని చెబుతున్నారు. అలా కొంతమంది తప్పించుకు వచ్చినట్లు తెలిపారు.