ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచిన పిమ్మట స్వర్గాన్నుండి బృహస్పతి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన *విశ్వరూపుణ్ణి* నియమించుకున్నాడు. ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు కోపించి విశ్వరూపుణ్ణి సంహరించేసరికి ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం ఆవహించింది. దాంతో ఆ దోషాన్ని పోగొట్టుకునేందుకు స్వర్గాన్ని వదిలి వెళ్లిపోయాడు ఇంద్రుడు. అప్పుడు దేవతలంతా కలిసి భూలోకానికి వచ్చి *నహుష మహారాజుకు* ఇంద్రాధిపత్యాన్ని కట్టబెడతారు. నహుషుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే ఇంద్రపదవి అతనికి లభించిందో అతడిలో గర్వాంధకారం పొడసూపడం మొదలుపెట్టింది. దాంతో దేవతలు, మహర్షులు, దికాపాలకులను కించపరచడమే కాకుండా శచీదేవిని కోరతాడు. అప్పుడు శచీదేవి *బ్రహ్మరథంపై* ఊరేగి రమ్మని అతడికి షరతు విధిస్తుంది. నహుషుడు సప్తర్షులచేత పల్లకీని మోయిస్తూ అందులో ఆశీనుడై బయల్దేరతాడు. బ్రహ్మరథమనబడే ఆ పల్లకీ మోస్తున్న వారిలో అగస్త్యుడు కూడా ఒకరు. అగస్త్యుడు పొట్టివాడు. అందుచేత అతను పల్లకీ మోసేవైపు ఒరిగిపోతూ ఉంటుంది. మంత్రాలను దారంతా అవమానపరుస్తూ... *సర్ప సర్ప* అంటూ అగస్త్యుడ్ని కాలితో తంతాడు నహుషుడు. సర్ప సర్ప అంటే తొందరగా నడవమని అర్థం. దాంతో కోపించిన అగస్త్యుడు ‘సర్పోభవ’ అంటూ శపిస్తాడు. ‘సర్పోభవ’ అంటే ‘సర్పం అవుదువుగాక!’ అని అర్థం. అగస్త్యముని సామాన్యుడా... మహా తపస్సంపన్నుడాయె. తక్షణమే నహుషుడు సర్పంగా మారి భూలోకంలోకి వచ్చిపడ్డాడు. ఎప్పుడైతే సర్పంగా మారాడో వెంటనే అతనిలోని గర్వం పటాపంచలైంది. తన తప్పిదానికి పశ్చాత్తాపపడి తనకీ రూపం నుండి విముక్తిని కలిగించాలని తిరిగి అగస్త్యుడ్ని పార్థించాడు. అగస్త్యుడు దయతలచి సర్పరూపంలో ఉన్న నీవు అడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు చెపుతారో వారి వల్ల నీకీ రూపం పోతుందని శాపానుగ్రహాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత అరణ్యవాసంలో భీముడు నహుషునికి చిక్కడంతో అతనికి శాపానుగ్రహం లభించి తిరిగి నహుషుడు మానవ రూపాన్ని ధరిస్తాడు. బ్రహ్మ వంశీయులు లేదా బ్రహ్మవేత్తల చేత మోయబడే వాహనాన్నే ‘బ్రహ్మరథం’ అంటారు.*