వృత్తి విద్యలే నిరుద్యోగుల ఉపాధికి సోపానాలుగా మారుతాయని నగర మేయర్ మదమంచి స్వరూప అభిప్రాయపడ్డారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాధులు, నైపుణ్యాల వికాస దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మేయర్ స్వరూప హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇదివరకే డియర్డీఏ, మెప్మా, జిల్లా సమాఖ్య ల తరపున వృత్తి ఉపాధి రంగాల్లో నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి థాంక్యూ సీఎం సార్ అంటూ ముక్తకంఠంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వివిధ ఉపాధి శిక్షణలు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందజేసిన సిండికేట్, స్టేట్ బ్యాంకు ల చీఫ్ మేనేజర్లు రాహుల్, శ్రీనివాసులును శాలువా తో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి రామారావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రామ సుబ్బమ్మ, మెప్మా పిడి సావిత్రి, నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ పగడాల క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.