ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వబోతోంది? అనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తోంది. ఒకే సామాజిక వర్గానికి అత్యంత ప్రాధ్యాన్యం ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల ద్వారా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ.. జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తల పేర్లు ప్రకటించడమే కాకుండా అనంతపురం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేరు ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతోకాలంగా వైసీపీ టికెట్లు ఆశిస్తున్న వా రు ప్రస్తుత తాజా పరిణామాలతో నీరుగారి పోతున్నారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. కదిరి నుంచి చాంద్‌బాషా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి మాత్రమే గెలుపొందారు. టీడీపీకి జిల్లా కంచుకోటలాంటిది. అలాంటి జిల్లాలో పట్టు సాధించడానికి వైసీపీ అధినేత జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఎవరికీ స్పష్టమైన బాధ్యతలు అప్పగించలేదు. బీసీల ప్రాతిపదికగా రాజకీయాలు కొనసాగుతున్న ఈ జిల్లాలో ఆ వర్గానికి చెందిన పలువురు తమకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ న్యాయం చేస్తుందని ఆశించారు. ఆ ఆశతోనే ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా హిందూపురం, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల పేర్లు ప్రకటించారు. హిందూపురానికి ముస్లిం మైనారిటీ నాయకుడు నదీం అహ్మద్‌ను, అనంతపురానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్యను నియమించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీలో సమన్యాయం పాటిస్తున్నామని చెప్పుకోడానికి చాలా ఉదాహరణలే సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తగా పార్టీలో చేరిన జిల్లా మాజీ అధికారి తలారి రంగయ్య (బీసీ-వాల్మీకి)ను నియమించారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ముస్లిం మైనారిటీ నేత నదీంను నియమించారు. ఇక రా బోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల ప్రాధాన్యతలను పరిశీలిస్తే.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పది మందికి పైగా వైసీపీ టికెట్లు కేటాయించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి అంచనాలను పరిశీలిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బాధ్యులుగా ఉన్న వారికే టికెట్లు దక్కే అవకాశాలున్నాయని సమాచారం. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సుమారు 10కి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే వైసీపీ టికెట్లు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, గుంతకల్లు నుంచి వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉరవకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కదిరి నుంచి సిద్దారెడ్డి, పుట్టపర్తి నుంచి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులుగా వారికే గుర్తింపు ఉంది. కాగా, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్, శింగనమల నుంచి పద్మావతి టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆ రెండు సీట్లు కూడా రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యంలో ఉన్నవే కావడం గమనార్హం. ఇలా పరిశీలిస్తే.. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గానూ 11 నియోజకవర్గాల్లో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆ సీటు ఎవరికి కేటాయించాలనే విషయం ఇంకా స్పష్టం కాలేదని సమాచారం.
హిందూపురం నుంచి నవీన్ నిశ్చల్‌కు అవకాశం కల్పించవచ్చునని పార్టీ వర్గాల సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్‌ను గమనిస్తే.. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదా పు 11 నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గ నేతలే వైసీపీ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ లు కూడా తమ పార్టీలో నియోజకవర్గాల నేతలుగా ఉన్నారని చెప్పుకుంటున్నా వారి వెనుకమాత్రం జగన్ సామాజికవర్గ నేతలే చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. ఇక ముి స్లంల విషయానికొస్తే.. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త నదీంను ఉన్నట్టుండి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈ మార్పు వెనుక మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
అనంతపురం శాసనసభ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తను తరచూ మారుస్తున్నారు. ఆ నియోజకవర్గ వైసీపీ పగ్గాలు ఎంతమందికి అప్పజెబుతారనే అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. 2014లో అనంతపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్నాథరెడ్డిని ఎన్నికల అనంతరం నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా ప్రకటించారు. ఆతర్వాత గుర్నాథరెడ్డి తనకు సన్నిహితులుగా ఉండే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అనంతపురం వైసీపీ సమన్వయకర్త స్థానం ఖాళీ అయింది. ఆ తరుణంలో నదీంను తెరమీదికి తెచ్చి వచ్చే ఎన్నికల్లో అనంతపురం టికెట్ ఆశ కల్పించారు. కొన్నాళ్ల తరువాత అనంతపురం నగరానికి చెందిన శివారెడ్డి కూడా పార్టీలో చేరారు. గుర్నాథ్‌రెడ్డి స్థానంలో అదే సామాజికవర్గ నేతగా గుర్తింపు వస్తుందని భావించి ఆయన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ప్రస్తుతం అనంతపురం బాధ్యతల నుంచి నదీంను తప్పించి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇలా తరచూ నియోజకవర్గ బాధ్యులను మారుస్తూండడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు