ఇవాళ్టి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ క్వశ్చన్ అవర్
హైదరాబాద్, ఆగస్టు 30,
ఈడీ ఎంట్రీతో టాలీవుడ్‌లో మరోసారి స్క్రీన్ షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసును రీఓపెన్ చేసి.. విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ.. చేసింది. మంగళవారం పూరీ జగన్నాధ్… సెప్టెంబర్ 2న చార్మీ.. 6న రకుల్ ప్రీత్ సింగ్.. విచారణకు రావాలని ఆదేశించింది. రానా దగ్గుపాటి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ కూడా ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. సెప్టెంబర్ 22న సినీ ప్రముఖుల విచారణ ముగియనుంది. ఆ తర్వాత ఈ కేసుతో లింకులు ఉన్న మరికొందరిని విచారించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా 62 మందిని విచారించబోతోంది.డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లింటినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో.. హీరోలు, హీరోయిన్లు, నటీనటులే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు వినిపించాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గతంలో పలువురుకి క్లీన్ చిట్ ఇవ్వడం కూడా సంచలనమైంది. ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో.. మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ షేక్ అవుతోంది.
విదేశాలకు నిధులను ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించిన పెడర్స్ కెల్విన్, విక్టర్, కమింగాల స్టేట్‌మెంట్ సేకరించారు. ఆ విషయాల ఆధారంగా సినీ నటులను విచారించనున్నారు. అంతేకాదు ఫారెన్ బ్యాంకులకు ఎంత డబ్బు అక్రమంగా తరలిందనే విషయమై ఆరా తీస్తోంది. దీని కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకుంటోంది.
విచారణ తేదీలు, హాజరవ్వాల్సిన ప్రముఖులు:
ఆగస్టు 31: పూరీ జగన్నాథ్
సెప్టెంబర్ 2 : చార్మీ కౌర్
సెప్టెంబర్ 6 : రకుల్ ప్రీత్ సింగ్
సెప్టెంబర్ 8 : రానా దగ్గుబాటి
సెప్టెంబర్ 9 : రవితేజతోపాటు అతని డ్రైవర్ శ్రీనివాస్
సెప్టెంబర్ 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్
సెప్టెంబర్ 15: ముమైత్ ఖాన్
సెప్టెంబర్ 17: తనీష్
సెప్టెంబర్ 20: నందు
సెప్టెంబర్ 22: తరుణ్