200వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం
విశాఖపట్నం ఆగష్టు 30
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేటితో(సోమవారం) 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇక ఉద్యమంలో భాగంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న 10వేల మందితో మానవహారం చేపట్టారు. సాయంత్రం క్యాండిల్ ర్యాలీలు చేపట్టనున్నారు. కాగా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచి అండగా ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ చేయొద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్‌ప్లాంట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్‌లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది.