YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో వన్ మ్యాన్ షో... డమ్మీలుగా మారుతున్న నేతలు...

వైసీపీలో వన్ మ్యాన్ షో... డమ్మీలుగా మారుతున్న నేతలు...

విజయవాడ, ఆగస్టు 31, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా వన్ మ్యాన్ షో తో బండి లాక్కొస్తున్నారు. ఒక్క బటన్ నొక్కి వందల, వేలకోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల ఫలాలు వెళ్ళేలా వ్యవస్థను నిర్వహిస్తూ విపక్షానికే కాదు స్వపక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా వ్యవస్థలో లోపాలు తెలియడంతో ఈ నగదు బదిలీ కార్యక్రమం చకచకా చేసుకుపోతున్నారు. ఇది ఆయన వరకు బాగానే ఉంది. అయితే ప్రచార పటాటోపాలతో తమ చేతుల మీద ఇలాంటి నగదు బదిలీ కార్యక్రమాలు జరిపించి ఉంటే వ్యక్తిగత ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుందని లోలోపల ఎంపీ, ఎమ్యెల్యేలు మధన పడుతున్నారు. కానీ జగన్ ఆ ఛాన్స్ ఇచ్చే ప్రశ్నే కనిపించడం లేదు. ఎందుకంటే అలా చేస్తే ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వని నేతలు రెబల్స్ గా లేదా ప్రత్యర్థి పార్టీల్లో చేరి తలపోటు కావడం అధినేత జగన్ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఏ చిన్న అవకాశం నేతలకు ఇవ్వదలుచుకోనట్లే వైసిపి బాస్ ఆలోచనగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఏపీ లో ఎంపీ, ఎమ్యెల్యేలకు పెద్దగా పని ఉండటం లేదు. జగన్ పెట్టే వీడియో కాన్ఫరెన్స్ లు సైతం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ మీటింగ్స్ కు దగ్గరలో ఉన్న ఎంపీ, ఎమ్యెల్యేలే హాజరు అవుతున్నారు. అందులో కూడా ఒక సెకను బాగున్నారా అన్నా, అక్కా అంటూ పలకరించే జగన్ నేరుగా లబ్ది దారులతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులను తనతో మాట్లాడేందుకు ఆన్ లైన్ లో కూడా ఆయన అవకాశం ఇవ్వడం లేదు.అర్హత ఉండి ఎంపిక కానీ వారికి ప్రతీ పథకానికి తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా అవకాశం ఉంటుంది. దాంతో ప్రజాప్రతినిధులు కానీ పార్టీ క్యాడర్ కి కానీ నేరుగా ఎలాంటి కనెక్షన్ లేకుండా పోయింది. సంక్షేమ పథకాలకే నిధులు అన్ని వెచ్చిస్తుంటే రోడ్లు, డ్రైన్ లు ఇతర మౌలిక సదుపాయాల అంశాల్లో స్థానిక నేతలే ప్రజలకు టార్గెట్ అవుతున్నారు. వీటికి నిధులు తేలేక ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా ఏమి చేయలేకపోతున్నారు నాయకులు. నెలకు నాలుగు ఐదు వర్ట్యువల్ మీటింగ్స్ తో సంక్షేమ పథకాలకు నిధులను ఇదే రీతిన తమ పార్టీ అధినేత జగన్ బటన్ నొక్కుకుంటూ పోతే తమకు ఎలాంటి గుర్తింపు భవిష్యత్తులో కూడా ఉండటం కష్టమేనని నేతలు వాపోతున్నా వారిగోడు జగన్ గుర్తించి పరిష్కారం చూపడం అయ్యే పనికాదన్నదే పొలిటికల్ వర్గాల్లో టాక్. దాంతో వీరంతా ఎంపి, ఎమ్యెల్యేలు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.

Related Posts