విశాఖపట్టణం, ఆగస్టు 31,
తెలుగు రాజకీయాల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్న పేరు తెలియని వారు ఉండరు. ఆయన 1995లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా హరిక్రిష్ణ మద్దతు సాధించి గెలిచిన నేత. ఆ మీదట బీజేపీకి మద్దతు సాధించి కేంద్ర స్థాయిలో కూడా పరపతి పెంచుకున్నారు. తరువాత కాలంలో చంద్రబాబు నుంచి వేరుపడి నందమూరి హరిక్రిష్ణ అన్న తెలుగుదేశం పార్టీకి తెర వెనక వ్యూహకర్తగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మారారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ కి అత్యంత ఇష్టుడిగా మారి వైసీపీ జమానాలోనూ రాణిస్తున్నారు.జగన్ కొందరి విషయంలో మాత్రమే ప్రత్యేక ప్రేమ చూపిస్తారు. అలాంటి ప్రేమను పొందిన వారిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముందు వరసలో ఉన్నారు. జగన్ ఇలా అధికారంలోకి రాగానే అలా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను నియమించారు. రెండేళ్ళ పాటు ఆ పదవిలో ఆయన కొలువు తీరారు. క్యాబినేట్ ర్యాంక్ పదవి ఇది. తాజాగా ఆ గడువు పూర్తి అవుతూనే మరో తడవ ఆయనకే కిరీటం అప్పగించారు. నిజానికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గత రెండేళ్లలో ఆ పదవిలో కూర్చుని ఏం చేశారు అన్నది ఒక ప్రశ్న అయితే ఆయన వైసీపీకి ఏం సేవలు చేశారు అన్నది మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. మరి ఆయన అంటే జగన్ కి ఎందుకంత మోజు అని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది.తెలుగు భాష ఉద్ధరణ అన్నది నిరంతర ప్రక్రియ. అధికార భాషా సంఘం బాధ్యతలు కూడా చాలా కీలకం. కానీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాత్రం ఎంతవరకూ క్రియాశీలకంగా వ్యవహరించారు అన్నదే డౌట్ గా చెబుతారు. మరో వైపు టీడీపీ సహా ఇతర పార్టీలు అయితే ఏపీలో తెలుగు ఎక్కడ ఉంది అంటున్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కేవలం పదవి అనుభవించడానికే పరిమితం అయ్యారు తప్ప తెలుగు భాషా వికాసానికి చేసినది ఏదీ లేదని కూడా అంటున్నారు. మరో వైపు యార్లగడ్డ తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక సూచనలు కానీ తీసుకునన చర్యలు కానీ లేవని, పైగా ఇంతవరకూ చేసిందేంటో చెప్పాలని భాషాభిమానులు అంటున్నారు.ఇక యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎపుడూ విశాఖలోనే ఉంటారు. లేకపోతే తన సొంత పనులు చూసుకుంటారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంది. ఆయన అసలు ఆఫీస్ కి వెళ్తున్నారా అంటే జవాబు ఉండదు. ఇక తాజాగా ఆయన కోరడం ప్రభుత్వం అంగీకరించడం జరిగిందిట. అదేంటి అంటే అధికార భాషా సంఘం ఆఫీస్ ని విశాఖలోనే ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఓకే చెప్పారుట. మరి ఈ విధంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆఫీస్ ని విశాఖలో తెచ్చుకున్నా తన హోదాకు అప్పగించిన బాధ్యతలకు తగిన రీతిన స్పందించి పనిచేస్తారా అన్నదే ప్రశ్న అంటున్నారు ప్రత్యర్ధి వర్గాలు. మరో వైపు చూస్తే వైసీపీ కోసం కష్టపడిన వారు లక్షలలో ఉన్నారు. వారిలో కూడా మేధావులు, తెలుగు భాషాభిమానులు ఉన్నారు. మరి వారిని పక్కన పెట్టి రెండు సార్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి ఈ పదవి అప్పగించడం ఏంటి అని గుర్రుమంటున్నారు. ఆయన వైసీపీ కోసం ఏనాడైనా మాట్లాడారా అని కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ పక్కన పెడితే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్న వారు చాలా అదృష్టవంతులు అన్నది ప్రత్యర్ధులు సైతం అంగీకరిస్తారు. ఆయనకు అన్నీ పార్టీలలో మిత్రులు ఉన్నాయి. అందుకే పదవులు అలా వచ్చేస్తూ ఉంటాయని చెబుతారు.