YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిల చెల్లని నాణమా

షర్మిల చెల్లని నాణమా

హైదరాబాద్, ఆగస్టు 31, 
రాజకీయాలలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. ఎవరైనా జనంలోకి రావచ్చు. కానీ నెగ్గేవారు మాత్రం బహు తక్కువ. ఎందుకంటే ఏ కోటికో ఒకరో ఇద్దరినో ముఖ్యమంత్రి సీటు దక్కుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణాకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాలని వైఎస్ షర్మిల భావించారు. అందుకే వెనకా ముందూ ఆలోచించకుండా ఆమె రంగంలోకి దిగారు. అన్న జగన్ మాటను కూడా ఈ విషయంలో పెడచెవిన పెట్టారని చెబుతారు. తెలంగాణాలో నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న టీడీపీకే ఇపుడు మంచినీళ్ళు పుట్టడంలేదు. అలాంటిది వైఎస్ షర్మిల అక్కడ పార్టీని పెడతాను అంటే ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది.అయినా వైఎస్ షర్మిల ధైర్యం చేసి పార్టీ పెట్టేశారు. ఈ రోజుకూ ఆ పార్టీలో షర్మిల తప్ప పేరున్న మరో నాయకుడు లేడు. అంతదాక ఎందుకు సర్పంచ్ స్థాయి ఉన్న వారు కూడా ఆమె పార్టీలో చేరలేదు. ఇక వైఎస్ షర్మిలది ఈ విధంగా చూస్తే ఒంటరి పోరాటమే అయింది అంటున్నారు. ఆమె పార్టీ పేరుతో ఇప్పటికే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇది చాల‌దు అన్న‌ట్టుగా వైఎస్ షర్మిల సోష‌ల్ మీడియాలో ప్ర‌మోష‌న్ల కోసం భారీ ఎత్తున డ‌బ్బు ఖ‌ర్చు పెడుతున్నారు. ఇక పార్టీ ప్ర‌క‌ట‌న రోజునే ప్ర‌ధాన పేప‌ర్ల‌కు ఫ్రంట్ పేజీలో ప్ర‌క‌ట‌న‌ల‌తో భారీ ఎత్తున కోట్లు కుమ్మురించేశారు.ఇవి కాక వైఎస్ షర్మిల అక్క‌డ సొంతంగా ఓ మీడియా ఛానెల్ ఏర్పాటు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఆమె చేతి చమురు ఎంత వదిలించుకున్నా కూడా నష్టమే తప్ప భవిష్యత్తులో ప్రయోజనం లేదు అన్నది కూడా ఉంది. వైఎస్ షర్మిల పార్టీని పెట్టాలి అనుకున్నపుడు కాంగ్రెస్ దీనావస్థలో ఉంది. బీజేపీ పలుకుబడి కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం. అయితే షర్మిల పార్టీ అని అనౌన్స్ చేశాక కాంగ్రెస్ బాగా జాగ్రత్తపడింది. రేవంత్ రెడ్డి వంటి ఫైర్ బ్రాండ్ ని తెచ్చి పీసీసీ చీఫ్ ని చేశారు. దాంతో కాంగ్రెస్ లో ఎక్కడలేని చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కూడా సర్దుకుపోయారు.ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఇపుడు పోటీకి తయారుగా ఉంది. దాంతో వైఎస్ షర్మిలకు అలా షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి తనకు వెల్లువలా జనాలు వచ్చి చేరుతారు అనుకున్న చెల్లెమ్మ ఇపుడు నీరుకారిపోయారు. ఇక రెడ్డి ఓట్ల‌పై ఆమె ముందు నుంచి ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే రేవంత్ రెడ్డికి అక్క‌డ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లు అంద‌రూ ఈ సారి కాంగ్రెస్‌కే చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఒక సర్వే చేస్తే ఆమె పార్టీ ఎక్కడా ఉనికిలో కూడా లేదని అంటున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే గా కూడా గెలిచే సీన్ లేదని చెబుతున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణాలో చెల్లని నాణెమేనని చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల దాకా పార్టీని నడపడం అంటే షర్మిలమ్మకు కష్టమే అన్న మాట కూడా వినిపిస్తోంది.

Related Posts