హైదరాబాద్, ఆగస్టు 31,
కరోనా వచ్చాక ప్రజల జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, ఊదలు వంటి ప్రొడక్ట్‌లకు డిమాండ్ క్రియేట్ అవుతోంది. ఒకప్పుడు ఇండియా నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులు ఎవైనా ఉన్నాయంటే అవి బియ్యం, గోధుమలే. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చిరుధాన్యాల ఎగుమతులు పెరుగుతున్నాయి. కరోనా తర్వాత యూరప్, పశ్చిమాసియా, యూఎస్ నుంచి మన దగ్గర పండుతున్న చిరుధాన్యాలకు డిమాండ్ క్రియేట్ అవుతోంది. కేవలం చిరుధాన్యాలే కాదు, అస్సాంలో పండే రెడ్ రైస్, లెటెకు పండు (బర్మీస్ ద్రాక్ష), త్రిపురాలో దొరికే పనస, కాన్పూర్‌లో పండే నేరేడు, బగల్‌పురి మామిడి, కాశ్మీర్‌లో దొరికే మిశ్రీ పండు, హిమచల్‌ప్రదేశ్‌లో దొరికే యాపిల్స్..ఇలా 12 కొత్త రకం అగ్రీ ప్రొడక్ట్‌లు దేశం నుంచి మొదటిసారిగా ఎగుమతయ్యాయి. తాజాగా ఇప్పపువ్వును మొదటి సారిగా విదేశాలకు ఎగుమతి చేశాం. చిరు ధాన్యాల్లో ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో ఆర్గానిక్‌గా దొరికే వ్యవసాయ ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారు. తాజాగా డెన్మార్క్‌కు 4 వేల కేజీల రాగులు, ఊదలను ఈ ఏడాది మే లో ఎగుమతి చేయగలిగామంటే అర్థం చేసుకోవచ్చు యూరప్ దేశాలకు మన ప్రొడక్ట్‌లపై ఆసక్తి పెరుగుతోందని. ఆర్గానిక్ కావడం, హిమాలయ ప్రాంతాల్లో పండుతుండడం, పోషకాల విలువ ఎక్కువగా ఉండడం వంటి అంశాలు యూరొపియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ‘రాగిలో కాల్సియం ఎక్కువగా ఉంటుంది. ఊదల్లో ఐరన్ ఎక్కువ. హెల్త్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న యురొపియన్లు ఇలాంటి ప్రొడక్ట్స్ కోసం చూస్తున్నారు. తాజాగా మాకొచ్చిన ఆర్డర్ల ప్రకారం, ఈ ఏడాది ఈ ప్రొడక్ట్‌లను 100 మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి చేయగలుగుతాం’ అని హిమాలయాల్లో పండే చిరుధాన్యాలను ఎగుమతి చేస్తున్న జస్ట్ ఆర్గానిక్ కంపెనీ పేర్కొంది.ఈ ప్రొడక్ట్‌లన్నింటిలో ఒకటి కామన్ ఉంది అదే పోషకాలు ఎక్కువగా ఉండడం. యూరప్, పశ్చిమాసియా ప్రజలు ఈ ప్రొడక్ట్‌లకు ఆకర్షితులవ్వడానికి అదే కారణం. కొత్త ప్రొడక్ట్‌లను ఎగుమతి చేయడంపై ప్రభుత్వ సంస్థ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) పనిచేస్తోంది. ‘బియ్యం ఎగుమతి చేయడంలో మనకు థాయ్‌లాండ్ , వియత్నం నుంచి గట్టి పోటీ ఉంది. గొడ్డు మాంసం ఎగుమతి చేయడంలో బ్రెజిల్ నుంచి పోటీ ఉంది. కానీ, హిమాలయాల్లో పండే చిరుధాన్యాలు, నార్త్ ఈస్ట్‌లో దొరికే పనస లేదా చత్తీస్‌గడ్‌లో దొరికే ఇప్ప పువ్వు వంటి ప్రొడక్ట్‌లను ఎగుమతి చేయడంలో మనకు ఎటువంటి పోటీ లేదు’ అని ఏపీఈడీఏ చైర్మన్ ఎం అంగముతు అన్నారు. ఎక్కువగా పోషకాలు ఉండే ఇలాంటి 100 కొత్త ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయడంపై దృష్టి పెట్టామని అన్నారు. అస్సాంలో కూడా లెటెకు పండు ఫేమస్. దీన్ని కొంత మంది ఎంటర్‌ప్రెన్యూర్లు బిజినెస్‌గా మార్చుకుంటున్నారు. విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఈ పండ్లకు కరోనాతో డిమాండ్ మరింత పెరిగింది. ఏపీఈడీఏతో జట్టు కట్టి 1,500 కేజీల లెటెకు పండ్లను దుబాయ్‌కు ఎగుమతి చేశాడు.అస్సాం నుంచి బౌ ధాన్ (రెడ్ రైస్) కూడా తాజాగా మొదటి సారిగా ఎగుమతి చేయగలిగాం. బ్రహ్మపుత్ర లోయల్లో పండుతున్న రెడ్ రైస్‌ను 40 మెట్రిక్ టన్నుల మేర యూఎస్‌కు హర్యానాకు చెందిన ఎక్స్‌పోర్టర్ ఒకరు ఎగుమతి చేశారు. త్రిపురలో దొరికే పనస ఈ ఏడాది మే–జూన్ మధ్య 2.8 మెట్రిక్ టన్నుల మేర లండన్‌కు ఎక్స్‌పోర్ట్ అయ్యాయి. జీఐ ట్యాగ్ ఉన్న నాగాలాండ్ మిరప 200 కేజీల మేర లండన్‌కు ఎగుమతియ్యింది. తమిళనాడు నుంచి ఐదు రకాల మూలికలు, మెడికల్ ప్లాంట్లను ఎగుమతి చేశామని చైన్నైకి చెందిన జేసీ ఆర్గానిక్స్ పేర్కొంది. డయేరియా, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి రోగాలకు ఈ మెడిసిన్స్‌ను వాడాతారని ఈ కంపెనీ చెబుతోంది. నేరేడు పండ్లు వంటివి తొందరగా పాడవుతాయని, వీటిని వీలున్నంత తొందరగా ఎగుమతి చేయాల్సి ఉంటుందని ఎక్స్‌పోర్టర్లు చెబుతున్నారు. కాన్పూర్‌లోని నేరేడు రైతులకు కేజీపై రూ. 35–40 దక్కుతాయి. అదే ఎక్స్‌పోర్టర్లు వీరికి కేజీకి రూ. 70 వరకు చెల్లించి తీసుకుంటున్నారు. లండన్‌లో కేజీ నేరేడు పండ్లపై రూ. 800 వరకు పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు ఎక్కువగా ఉండడం వలనే ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎక్స్‌పోర్టర్లు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్–జులై మధ్య 5 వేల కేజీల నేరేడు పండ్లను లండన్‌కు ఎక్స్‌పోర్ట్ చేశామని, తర్వాతి సీజన్‌లో గ్రీస్, ఇటలీ మార్కెట్లకు ఎగుమతి చేస్తామని బడ్డీ ఓవర్‌సీస్ ఫౌండర్ కమల్‌దీప్ సింగ్ అన్నారు. లోకల్ మార్కెట్లలో కంటే 25 శాతం ఎక్కువ రేటుకే ఎక్స్‌పోర్టర్లు తమ నుంచి ప్రొడక్ట్‌లు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా మూడో వంతు డబ్బులు ముందే చెల్లిస్తున్నారని లక్షణ్ అనే రైతు చెప్పారు. కొత్త ప్రొడక్ట్‌లను ఎగుమతి చేయగలుగుతుండడంతో రైతులు కూడా లాభపడుతున్నారు