హైదరాబాద్, ఆగస్టు 31,
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ? ఇపుడిదే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీల హడావిడి చూస్తే.. ఈపాటికే హుజురాబాద్ ఉప ఎన్నిక జరగడం.. ఫలితం వెల్లడవడం జరిగి వుండాల్సిందే అన్న అనుమానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో.. ఆనాటి నుంచి రేపా ఎల్లుండా హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు హడావిడి చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ కూడా తోడవడంతో హుజురాబాద్ పాలిటిక్స్ పలు మార్లు పత్రికల్లో పతాక శీర్షికలకు, ఎలక్ట్రానిక్ మీడియాలో బులెటిన్ హెడ్‌లైన్స్‌లోను సందడి చేశాయి. గల్లీకో నాయకున్ని నియమించిన గులాబీ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూదన్న రీతిలో హుజురాబాద్‌పై అస్త్రశస్త్రాలను మోహరించింది. ఈటల రాజేందర్ చేరికతో స్థానికంగా బలపడ్డామని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ సైతం దూకుడు ప్రదర్శిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఓటమిపాలైన కౌశిక్ రెడ్డి పార్టీ మారడంతో అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం హుజురాబాద్‌లో సత్తా చాటుతామని ప్రకటనలు గుప్పిస్తోంది. ఇదంతా బాగానే వున్న ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటనలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇదిపుడు తెలంగాణలో ఏ మాత్రం పొలిటికల్ నాలెడ్జ్ వున్నవారిని కదిలించినా వినిపిస్తున్న ప్రశ్న.ఈటల రాజేందర్ రాజీనామా చేసి మూడు నెలలు కావస్తోంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరు నెలలలోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సివుంది. ఎమ్మెల్యే ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో జరగుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. నిన్నమొన్నటి దాకా తెలంగాణాలో కరోనా సెకెండ్ వేవ్ కొనసాగింది. ఇపుడిపుడే సెకెండ్ వేవ్‌లో నమోదవుతున్న గణాంకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రతీరోజు 300 నుంచి 400 మధ్య కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొంటున్న తరుణంలో హుజురాబాద్ ఎన్నికపై షెడ్యూలు వెలువడుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఏ మాత్రం తొందరపాటు ప్రదర్శించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకుడు, మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ వీలైనంత త్వరగా హుజురాబాద్ ఉపఎన్నిక నిర్వహించాలని కోరారు. 2004 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న ఈటల రాజేందర్ పార్టీ వీడడంతో పార్టీనా.. ఆయన వ్యక్తిగతమా.. ఆయన వరుస విజయాలకు కారణమేంటనేది తేలబోతోందిపుడు. స్వరాష్ట్ర కాంక్షను ప్రజ్వరిల్ల చేయడం ద్వారా తొలుత కమలాపూర్, ఆ తర్వాత హుజురాబాద్‌లో ఈటల విజయం సాధిస్తూ వచ్చారు. పలుమార్లు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళినా ఈటలనే విజయం వరిస్తూ వచ్చింది. కానీ ఇపుడు ఆయనా ? లేక ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీనా ఏది ఆయన వరుస విజయాలకు కారణమైందో తేలబోతోంది. పార్టీ బలంతో గెలిచినా అన్ని సార్లు గెలిచారు కాబట్టి తనకూ సొంత బలం వుంటుంది. అయితే.. పార్టీ ప్రాబల్యాన్ని అధిగమించేలా ఈటల రాజేందర్ సొంతబలాన్ని, బలగాన్ని పెంచుకున్నారా…? దానికి ఎంతో కొంత వున్న బీజేపీ ఓటు బ్యాంకు కలిస్తే.. ఈటల విజయం సాధిస్తారా అన్నది తేలాల్సి వుంది. ఇక అధికార పార్టీ అన్ని హంగులతో.. అధికార దర్పంతో బలగాలను మోహరిస్తూనే వుంది. నలుగురు మంత్రులను, పది మంది ఎమ్మెల్యేలను.. మరీ ముఖ్యంగా ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావును గులాబీ బాస్ హుజురాబాద్‌లో మోహరించారు. ఇంతటితో సరిపెట్టకుండా.. దళిత బంధులాంటి ప్రతిష్టాత్మక పథకాన్ని కూడా హుజురాబాద్ నుంచే ప్రారంభించారు.అధికార పార్టీ దూకుడును నిలువరించేందుకు బీజేపీ కూడా ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. హుజురాబాద్ విజయమే లక్ష్యంగా తన యాత్ర కొనసాగబోతున్నట్లు సంకేతాలిచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులందరు హాజరైన పాదయాత్ర ప్రారంభ సభ చార్మినార్ ప్రాంతాన్ని కాషాయమయం చేసింది. చార్మినార్ సభలో ఓ వైపు కేంద్ర పర్యటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ కుమార్ అధికార టీఆర్ఎస్ నేతలకు సవాళ్ళు విసిరారు. ఇకపై దూకుడు పెంచబోతున్నట్లు కమలం నేతలు హింట్ ఇచ్చారు. ఇక పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. వరుస సదస్సులు నిర్వహిస్తూ.. ప్రభుత్వంపై పదునైన కామెంట్లు చేస్తున్నారు. అయితే.. పార్టీ అభ్యర్థి అనుకున్న కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో.. కాంగ్రెస్ నేతలకు ధీటైన అభ్యర్థిని వెతకాల్సిన పని పడింది. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బలమైన నేతగా పేరున్న మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసిందంటున్నారు. ఆగస్టు 30వ తేదీన హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.పార్టీల సన్నాహాలు ఇలా వుంటే.. అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అన్న ప్రశ్న తెలంగాణావ్యాప్తంగా పలు చోట్ల వినిపిస్తోంది. సెప్టెంబర్ నెల మొదటివారంలో షెడ్యూలుపై ప్రకటన వస్తుందని అందరు అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై వుంది. వాటిలో ఖాళీ అయిన మూడు నియోజకవర్గాలకు ఆరు నెలల గడువు అక్టోబర్‌తో ముగుస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని రాజకీయపార్టీలు అంఛనా వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దూకుడు పెంచాలని భావిస్తున్నాయి.