కర్ణాటకలోని పర్యాటక ప్రాంతమైన హంపీలో మంగళవారం అరుదైన జాతికి చెందిన పాము దర్శనమిచ్చింది. విజయపురకు చెందిన కొందరు పర్యాటకులు ఓ వాహనంలో హంపీ సందర్శనకు వచ్చారు. ఉగ్రనరసింహ స్మారకం వద్ద బస్సును ఆపి స్మారకాన్ని తిలకించారు. అనంతరం బస్సు ఎక్కుతుండగా ఓ సీటులో పాము కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు పాముల సంరక్షకుడు, కమలాపురకు చెందిన పంపయ్యస్వామి మళెమఠకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి వచ్చి ఆ పామును పట్టుకుని హంపీ అటవీ ప్రాంతంలో వదిలేశారు. కోలుబార్ బోలనతి రేజ అని పిలిచే ఈ పాము చాలా అరుదైనదని.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తుందని పంపయ్యస్వామి చెప్పారు. ఇది కాటేసినా ప్రాణాంతకం కాదని, విష ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.