జాతీయ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలోకి తమను లాగడంపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) తన విచారం తెలియజేస్తూ లేఖ రాసింది. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సమన్వయ లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం 11 మందికి మాత్రమే పురస్కారాలు అందజేస్తారని తెలియడంతో.. తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ 50 మంది విజేతలు అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించారు. అది కూడా కేవలం ఒక్కరోజు ముందే ఇలా సమాచారం ఇవ్వడంపై వారంతా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.రాష్ట్రపతి కేవలం 11 మందికి మాత్రమే అవార్డు అందజేస్తారని కొన్ని వారాల ముందే రాష్ట్రపతి భవన్ నుంచి సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందిందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయినప్పటికీ వివాదం తలెత్తడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కేవలం 11 మందికే అవార్డులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో చెలరేగిన వివాదంపైనా సదరు అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.సమాచార మంత్రిత్వ శాఖ విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. రాష్ట్రపతి భవన్ చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం కల్పించడం తప్పు. దీని వల్ల రాష్ట్రపతి భవన్ ప్రతిష్టకు భంగం కలుతుగుంది. ఈ వివాదంలో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని తీవ్ర కలతకు గురిచేశాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాంమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం స్మృతి ఇరానీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రపతి భవన్ లేఖపై పీఎంవో ఇప్పటి వరకు స్పందించలేదు.