విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఒకప్పుడు అమ్మవారు కనకదుర్గమ్మగా వెలిసింది. దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలుడే పర్వత రూపంగా కృష్ణమ్మకు అడ్డురాగా ఒక బెజం (సన్నని) మార్గం ద్వారా కృష్ణ వేణి ముందుకు వెళ్ళేందుకు అవకాశం లభించింది. అందుకే అక్కడ వెలసిన పట్టణానికి బెజ్జం వాడ అనే పేరు వచ్చింది. కాలాంతరంలో అది బెజవాడగా మారింది. ఇక అర్జునుడు పాశుపతాస్త్రజోసం ఇక్కడి కొండమీద కూర్చుని తపస్సు చేసి శివుని మెప్పించి, పాశుపతాన్ని దక్కించుకోవడంలో విజయుడైనందుకు గుర్తుగా దీనికి విజయవాడ అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. ఈ విషయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. పల్లవరాజు మాధవవర్మ ఈ నగరాన్ని పాలిస్తున్న రోజుల్లో ఆయన కుమారుడు రథంపై వేగంగా వెళుతుండగా ఒక బాలుడు రథం కిందపడి చనిపోయాడు. ఇందుకుగాను ధర్మాత్ముడైన మాధవ వర్మ తన కుమారుడని కనికరించక అతనికి మరణదండన విధించాడు. అతని ధర్మపరాయణత్వానికి సంతసించిన కొండమీది దుర్గాదేవి బాలుని బతికించి, రాకుమారునికి మరణ దండన లేకుండా చేసి ఆ నగరంపై పసిడి వర్షం కురిపించింది. దానితో ఆమె కనకదుర్గగా పేరుపొందింది. అమ్మవారు నొసటన చంద్రుని వంటి బొట్టుతో, లలాట ప్రదేశంలో కుంకుమతో ముఖమంతా పసుపుతో ప్రశాంత వదనంతో ఉంటుంది. కనకదుర్గమ్మ తనను పూజించే ముత్తయిదువులకు కొంగు బంగారమై వారి పసుపు కుంకుమలను కాపాడుతూ ఉంటుందని విశ్వాసం. ఎలాంటి కష్టాల నుంచైనా ఆమె గట్టెక్కిస్తుందని భక్తుల విశ్వాసం. నవరాత్రి వ్రతం చేసేవారు దీక్షాసాఫల్యం నిమిత్తం ఈ తొమ్మిది రోజులూ ఒక్క పూటే భోజనం చేస్తారు. అలా చేయలేని వారు చివరి మూడు రోజులైనా ఏక భుక్త దీక్ష వహిస్తారు. అదీ చేయలేని వారు ఒక్క రోజైనా ఉపవాసదీక్ష చేస్తారు. దీక్ష చేపట్టిన వారు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తారు. ఈ నవరాత్రులు నిష్టగా దేవికి పూజ చేస్తారు. అష్టమినాడు తప్పనిసరిగా పూజచేస్తారు. అమ్మ వారికి పిండివంటలతో నైవేద్యంనివేదిస్తారు. ఈ తొమ్మిది రోజులూ నేలమీదే భూశయనం చేస్తారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి కాలినడకనవచ్చి అమ్మను దర్శించడమనే దీక్షకూడా పూనుతారు. విజయవాడ కృష్ణానదిలో సాగే అమ్మవారి తెప్పోత్సవం ఓ ప్రత్యేక ఆకర్షణ.
దేవీ క్షేత్రాల్లో ఈ రోజుల్లో దేవీ పూజలు, హోమాలూ, సంతర్పణలతో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. దేవి అనుగ్రహం కోసం ఈ తొమ్మిది రోజులూ భక్తులు ఆలయాలలో బారులు తీరుతారు. శక్తి స్వరూపమైన అమ్మవారు ఎన్నో రూపాలు ధరిం చింది. రాక్షసులను దునుమాడింది. ఒకే అమ్మవారు ఇన్ని రూపాలు ధరించడంలో మరో పరమార్గం కూడా ఉంది. ఒకే దేవుడు వేర్వేరు రూపాలు ధనరిస్తాడని చెప్పడం కూడా ఈ వివిధ రూపాల అంతరార్థంగా చెప్పుకోవచ్చు. ఏ దేవికి పూజ చేసినా అది ఆ పరాశక్తిని పూజించినట్లే.సర్వదేవనమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటే ఏ దేవునికి నమస్కరించినా అది కేశవునికి చేరుతుందన్న వాక్యం కూడా ఇదే పరమారాన్ని చెబుతుంది. అందరు దేవతలలోనే కాక అన్ని జీవులలోను దేముణ్ని చూడాలన్నది సనాతన ధర్మం చెప్పే సత్యం.