విజయవాడ, సెప్టెంబర్ 1,
కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు రాష్ట్ర వాటా నిధులు మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడి) ద్వారానే సమీకరించాలని రాష్ట్ర ఆర్ధికశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు, కేంద్ర ఆర్ధికశాఖకు కూడా తాజాగా రాష్ట్రం లేఖ రాసింది. ప్రధానంగా ఐదు కేంద్ర ప్రాయోజిత పథకాల రంగాల్లో రూ. 7,200 కోట్లను ఓడితో సమీకరించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటివరకు బ్యాంకర్లు సానుకూలంగా స్పందించకపోయినప్పటికీ, వారితో మరోసారి చర్చలు జరపాలని, ఎలాగైనా వారిని ఒప్పించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు 40కిపైగా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు జరుగుతుండగా, వాటికి సంబంధించిన లావాదేవీలు ఒకే నోడల్ బ్యాంకు ద్వారా నిర్వహించాలని, ఆ ఖాతాను తమ ఆధీనంలోని పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేయాలని కేంద్రం అదేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకు, ఆ బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందేందుకు రాష్ట్ర ఆర్ధికశాఖ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. దీనిలో భాగంగా సింగిల్ నోడల్ బ్యాంకుగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాను గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అదే సమయంలో ఐదు రంగాలకు సంబంధించి పది పథకాలకు ఓడి సౌకర్యం కల్పించాలని బ్యాంకర్లకు శుక్రవారం లేఖ రాసింది. ఈ పది పథకాలకు మొత్తం 18,466 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర వాటాగా 11,229 కోట్లు వస్తుండగా, మిగిలిన 7,237 కోట్లను రాష్ట్రం తన వాటాగా భరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం తన వాటా నిధులను భరించే పరిస్థితిలో లేకపోవడంతో ఆ నిధులను ఓడీగా సమకూర్చుకోవాలని నిర్ణయించింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అమలు చేసే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఉపాథిహామీ (25 శాతం పనులు), పిఎంజిఎస్‌వై (40శాతం పనులు), స్వచ్ఛ భారత్ మిషన్ (40 శాతం పనులు), నిర్మల్ భారత్ మిషన్ (40 శాతం పనులు)కు సంబంధించి 6,950 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర వాటా 5,010 కోట్లు, రాష్ట్ర వాటా 1,940 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాగే వైద్య రంగంలో మౌళిక సౌకర్యాల కోసం జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే 40 శాతం పనులకు కేంద్రం 1,742 కోట్లు, రాష్ట్రం 1,162 కోట్లు, సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్ పనులకు కేంద్రం 1,556 కోట్లు, రాష్ట్రం 1,137 కోట్లు, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్రాలు 50 శాతం చొప్పున 650 కోట్లు, గృహ నిర్మాణ శాఖ ద్వారా కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్రం 2270 కోట్లు, రాష్ట్రం 2448 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే తన వాటా నిధులపై ఓడి సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు లేఖ రాసింది. సిరగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకును గుర్తించడం, ఖాతాలు తెరవడం, ఆ వివరాలను పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసం ధానం చేయడం వంటి చర్యలకు సెప్టెంబర్ నెలాఖరు పడుతుందని కేంద్రానికి వివరించింది. ఇప్పటికే నిధులను అమలు సంస్థలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా కేంద్రానికి వివరించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకుగా స్టేట్‌బ్యాంకును గుర్తించినట్లు రాష్ట్రం పేర్కొంది.