ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించండి
సచివాలయ సిబ్బంది మమేకం కావాలి
కమిషనర్ గిరీషా
తిరుపతి,మా ప్రతినిధి, సెప్టెంబర్ 01
నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కమిషనర్ గిరీషా నగరపాలక సంస్థ ఉద్యోగులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 14 వ డివిజన్ లోని ఎస్.టి.వి. నగర్, కొత్త ఇండ్లు, కేశవాయన గుంట తదితర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తో కలసి కమిషనర్ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో డ్రైనేజి కాలువల సమస్య, నీటి సమస్యను ప్రజలు కమిషనర్ దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ కాలువలను కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజి కాలువలపై మెట్లు, రాంపులు ఏర్పాటు చేయడంతో ఎక్కడికక్కడ మురుగునీరు ఆగిపోవడంతో అక్రమ నిర్మాణాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే మొత్తం డ్రైనేజి కాలువలు శుభ్రం చేయాలన్నారు. కేశవాయన గుంట వద్ద గల పెద్ద కాలువ నీరు రోడ్లపైకి వస్తున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా రెండు వైపులా డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి దుకాణం వద్ద రెండు చెత్త బుట్టలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో కలసి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. చెత్త ను తమ సిబ్బందికి అందించి నగరపరిశుభ్రతకు ప్రజలు తమవంతు సహకారం అందించాలన్నారు..
కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఆర్.ఎఫ్.ఓ. జ్ఞాన సుందరం, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరికృష్ణ, ఆర్.ఓ. సేతుమాదవ్, డి.ఈ. చంద్రశేఖర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, వై.సి.పి. నాయకులు తూకివాకం మహి, మెస్ట్రీలు, సెక్రెటరీలు, తదితరులు ఉన్నారు.