
దేశంలో అత్యాచార పర్వాలకు అంతం లేకుండా పోయింది. కామాంధులు పశువుల్లా బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టడమే కాకుండా వారిని దారుణంగా హతమారుస్తున్నారు. కథువా, ఉన్నావ్, దాచేపల్లి ఘటనలు మరవక ముందే.. జార్ఖండ్‌లో మరో బాలిక మృగాళ్ల చేతిలో బలైంది. ఆమెను రేప్ చేయడమే కాకుండా, సజీవంగా దహనం చేశారు. చత్రా జిల్లాలోని రాజకెందువ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు అపహరించి అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై శుక్రవారం బాధిత కుటుంబం పంచాయితీకి ఫిర్యాదు చేసింది. దీంతో గ్రామ పెద్దలు నిందితులతో 100 గుంజిళ్లు తీయించి, రూ.50 వేలు జరిమానా వేసి వదిలిపెట్టేశారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి తల్లిదండ్రులను చితకబాదారు. అనంతరం ఆమెకు నిప్పటించి సజీవ దహనం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు