ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ : ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ సెప్టెంబర్ 1
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు వివరాలను వెల్లడించింది. ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ఆగస్టులో జీఎస్టీ రెవన్యూ 30 శాతం అధికంగా వసూల్ అయినట్లు కేంద్ర ఆర్థిక చెప్పింది. అయితే ఈ ఏడాది ఆగస్టులో వసూలైన జీఎస్టీలో.. సీజీఎస్‌టీ రూ.20, 522 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఐజీఎస్టీ రూ.56,247 కోట్లు, సెస్ 8,646 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొన్నది. 2019 ఆగస్టు వసూళ్లతో పోలిస్తే .. ఈ ఏడాది 19 శాతం అధికంగా వసూలైనట్లు ప్రభుత్వం చెప్పింది. రెగ్యులర్, అడ్‌హక్ సెటిల్మెంట్లలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆగస్టు వాటాలో సీజీఎస్టీకి 55,565 కోట్లు, ఎస్జీఎస్టీకి 57,744 కోట్లు ఆదాయాన్ని కేటాయించారు.వరుసగా తొమ్మిది నెలల పాటు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ దాటిన తర్వాత.. జూన్ 2021లో కరోనా సెకండ్ వేవ్ వల్ల పడిపోయాయి. అయితే కోవిడ్ ఆంక్షలను సడలించడంతో.. జూలై, ఆగస్టులో మళ్లీ జీఎస్టీ వసూళ్లు తారాస్థాయికి చేరాయి. ఈ డేటా ఆధారంగా ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటున్నట్లు అర్థమవుతోందని ఆర్థికశాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. నకిలీ బిల్లులు సమర్పిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం వల్ల కూడా జీఎస్టీ వసూళ్‌రలో వృద్ధి వచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. రాబోయే నెలల్లోనూ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని ఆర్థికశాఖ అంచనా వేసింది.తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టులో రూ. 3,526 కోట్ల జీఎస్టీ వసూల్ అయ్యింది. గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో రూ. 2,793 కోట్ల జీఎస్టీ వసూలైంది. అంటే జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే తెలంగాణలో 26 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు తెలుస్తోంది.