నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదలచేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో నాని, రీతూ వర్మ, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ``ఫ్యామిలీ ఎమోషన్సే శివ నిర్వాణ బలం. నిన్నుకోరి, మజిలి సినిమాలను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఆ రెండు సినిమాల్లో ఇద్దరి ముగ్గురు మధ్యే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం చాలా మంది మధ్య ఎమోషన్స్ చూపించేశారు. ఇప్పటికే చాలా మందికి ట్రైలర్ చూపించాం. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే శివ నిర్వాణ బలం. అలా ఏడిపిస్తామని కాదు.. అందరిలోనూ ఆనంద భాష్పాలు వస్తాయి. థియేటర్లో కాకుండా సినిమాను ఓటీటీ విడుదల చేయడంపై కొంత మంది కొన్ని రకాల కామెంట్లు చేశారు. వారంతా నాకంటే పెద్దవాళ్లు. వారున్న పరిస్థితుల్లో అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఆ కాసేపు వాళ్లు నన్ను బయటి వాడిలా చేసేశారు. అదే నాకు బాధ. నేను వారి బాధను అర్థం చేసుకుంటాను. టక్ జగదీష్‌లో అన్నదమ్ముల రిలేషన్ మధ్య ఉండే ఆ కాంప్లెక్సిటీని దర్శకుడు మొదటగా చెప్పాడు. కథ చెప్పినప్పుడు నచ్చిన పాయింట్ అదే. రిలేషన్ షిప్లో ఉన్న కాంప్లెక్సిటీని మనం ఈ మధ్య మిస్ అవుతున్నాం. శివ నిర్వాణ తాను నిజ జీవితంలో చూసిన పాత్రలన్నీ కూడా ఇందులో పెట్టేశారు. అందుకే ట్రైలర్ ఇంత యూనిక్‌గా ఉంది. సినిమా కూడా అలానే ఉంది. తెలుగు తెరపై అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు, రిలేషన్స్ హ్యాండిల్ చేసి చాలా రోజులైంది. చిన్నతనంలో మనం చూసిన సినిమాలెన్నో ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా వాటిని మనం చూడలేదు. ఇదేమీ కొత్త సినిమా, ట్విస్ట్‌లు, కాన్సెప్ట్‌లు ఉండవు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమానే. మళ్లీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది.. కానీ మన ఇంట్లో మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. టక్ జగదీష్ కూడా మన ఇంటి సినిమా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.
నిన్నుకోరితో ఇది వరకే శివ నిర్వాణతో కలిసి పని చేశాను. రీతూ వర్మతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి చేశాను. ప్రవీణ్ అయితే నా కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సినిమాలు చేయకపోయినా కూడా టచ్‌లోనే ఉంటారు. తిరువూర్ అయితే అద్భుతమైన నటుడు. ఇంత వరకు ఆయన నటించిన సినిమాలు చూడలేదు. ఆయన చూడటానికి ఎంతో సింపుల్, స్వీట్‌గా ఉన్నారు. కానీ ఆయన పాత్ర మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన నటనను చూసి నాకు భయం వేసింది. సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో లెక్క ఉంటుంది.. అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలి. నిర్మాత, దర్శకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. థియేటర్లో అందరితో కలిసి చూడాలని ఎంతో అనుకున్నాను. కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి. బ్రేకుల్లేకుండా ఇకపై మీ (అభిమానులు, మీడియా) అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నారు.
చిత్ర దర్శకుడు శివనిర్వాణ మాట్లాడుతూ - ``చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. టక్ జగదీష్ కథ నానికి చెప్పినప్పటి నుంచి.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. రెండేళ్ల శ్రమ ఇది. ఏప్రిల్ 16న విడుదల చేద్దామని అనుకున్నాం. ఆ తరువాత మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇలా అన్ని అనుకున్నాం. థియేటర్లో ఆ సీన్‌కు అలా ఉంటుంది.. ఈ సీన్‌కు విజిల్స్ పడతాయి.. ఇంటర్వెల్ ఇలా ఉంటుంది అని ఎన్నో అనుకున్నాం. థియేటర్లో సినిమా విడుదల కావడం లేదు అని తెలిసినప్పుడు బాధ కలిగింది. అది నాకు, నానికి మాత్రమే తెలుసు. సినిమాను నాని థియేటర్ డోర్ వద్ద రెండున్నర గంటలు వెయిట్ చేసి నిల్చుని చూస్తాడు. అక్కడి నుంచి అయితే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది అని నాని ఎప్పుడూ కూడా తన సినిమాలను అలానే చూస్తాడు. థియేటర్లో సినిమా చూడటం నానికి అంత పిచ్చి. షైన్ స్క్రీన్‌తో రెండో సినిమా చేస్తున్నాను. నా డబ్బులే పెట్టి సినిమా తీస్తున్నాను అనేంత ఫ్రీడం నాకు ఉంటుంది. రెండేళ్లు సినిమాను తీశాం. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. ఇలాంటి సందర్భంలో చిన్నా పెద్దా అందరూ థియేటర్లోకి వస్తారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) రెమ్యూనరేషన్‌లోంచి కట్ చేసుకోమ్మని చెప్పాం. మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారు. ఒక్కో నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ పరిస్థితులు వేరు. ఎవరికి వీలున్నట్టు వారు సినిమాలను రిలీజ్ చేస్తారు. అందరినీ ఒకే గాడిన కట్టేయకండి. వినాయకచవితి నాడు టక్ జగదీష్ అదిరిపోతుంది’ అని అన్నారు.
కమెడియన్ ప్రవీణ్ మాట్లాడుతూ - ‘ప్రభుత్వ అధికారి పాత్రలో నేను నటిస్తున్నాను. ఆ పాత్ర గురించి దర్శకుడు అన్ని క్లియర్‌గా చెప్పారు. ఆయనే ఎన్నో ఇన్ పుట్స్ ఇచ్చారు` అన్నారు.
హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో గుమ్మ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది ‘థియేటర్లో విడుదల కావడం లేదనే బాధ నాకు కూడా ఉంది. పండుగ రోజు కుటుంబం అంతా కలిసి చూడటానికి కరెక్ట్ సినిమా`` అన్నారు
నటుడు తిరువీర్ మాట్లాడుతూ - ``శివ నిర్వాణ టీంను చూస్తేనే పండుగలా ఉంటుంది. తెలుగు కుటుంబాలు అందరూ కూడా చూసేందుకు సరైన సినిమా’ అని అన్నారు.