YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ వెలుగులోకి ఈఎస్‌ఐ మందుల స్కామ్

మళ్లీ వెలుగులోకి ఈఎస్‌ఐ మందుల స్కామ్

గుంటూరు, సెప్టెంబర్ 2, 
ఇఎస్‌ఐలో మందుల స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఉపయోగం లేని, కాలపరిమితికి మించిన మందులను తక్కువ ధరలకు కొనుగోలు చేసిన అధికారులు ఎక్కువ బిల్లులు పెట్టారు. ఇలా రెండేళ్ల కాలంలో రూ.50 కోట్లు విలువైన మందులను కొనుగోలు చేశారు. డిస్పెన్సరీల్లో కొంత కాలంగా ఈ మందులనే సరఫరా చేస్తున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పనిచేసిన జెడిలు, ఫార్మాసిస్టు, సీనియర్‌ అసిస్టెంట్ల ఆధ్వర్యాన జరిగిన ఈ అవినీతి బయటకు రావడంతో ప్రభుత్వం ఆ మందులకు సంబంధించిన బిల్లులను నిలిపేసింది. ఈ నేపథ్యంలో పాత బిల్లులు చెల్లించకపోతే కొత్తగా ఇఎస్‌ఐకు మందులు సరఫరా చేయబోమని ఫార్మా కంపెనీలు మెలికపెట్టాయి. దీంతో డిస్పెన్సరీలలో మందులు చేరక రోగులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 70 డిస్పెన్సరీలున్నాయి. వీటికి ఏటా సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువైన మందులు అవసరం ఉంటుంది. అనారోగ్యానికి గురైన కార్మికులు, ఉద్యోగులు ఈ డిస్పెన్సరీలకు వెళ్లి ఉచితంగా మందులు తెచ్చుకుని వాడుతుంటారు. వీరికిచ్చే మందులు కొనుగోళ్లలో పెద్ద గోల్‌మాల్‌ జరిగింది. అవసరం లేని మందులను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. జుట్టు రావడానికి వినియోగించే హెయిర్‌ ఫర్‌ యు మందు డిస్పెన్సరీలకు అవసరం లేదు. అయినా, 5 వేల బాటిల్స్‌ను కొనుగోలు చేశారు. ఒక్కో బాటిల్‌కు రూ.377 చెల్లించారు. వీటి కొనుగోలుకు రూ.18.85 లక్షలు చెల్లించారు. అలాగే డయాలసిస్‌ లిక్విడ్‌ ఆస్పత్రుల్లోనే ఇస్తారు. డిస్పెన్సరీలకు అవసరమని చెప్పి 2 వేల డయాలసిస్‌ ప్యాకెట్లను ఒక్కోదానికి రూ.500 చొప్పున రూ.పది లక్షలు చెల్లించి కొన్నారు. సుగర్‌ పేషెంట్లకు గాయం మాని చర్మం వచ్చేందుకు వాడే రెజెంట్‌-డి పూత మందు 17,272 బాటిల్స్‌ను కొన్నారు. ఒక్కోదానికి రూ.742 చొప్పున 1.13 కోట్లు చెల్లించారు. గుండె జబ్బు ఉన్నవారికి వాడే పాట్‌క్లర్‌ సిరప్‌ 24 వేల బాటిల్స్‌ కొన్నారు. ఒక్కో దానికి రూ.18 చొప్పున 4.32 లక్షల బిల్లులు పెట్టారు. కేన్సర్‌ పెషెంట్లకు వాడే టొఫోసినాబ్‌ మాత్రలు ఒక్కో బాక్సుకు రూ.400 చెల్లించి 9 వేల బాక్సులను రూ.36 లక్షలు పెట్టి కొన్నారు. ఇలా అవసరం లేని, లేదా తక్కువ అవసరమయ్యే మందులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి, కాలం దాటిన వరకూ ఉంచి తరువాత బయట పారేస్తున్నారు. డిస్పెన్సరీలకు ఇచ్చే సర్జికల్‌ కాటన్‌, క్రేప్‌ బ్యాండేజెస్‌, ఎల్‌ఎస్‌ బెల్ట్‌, నీ బ్రేస్‌ వంటివి సుమారు రూ.50 లక్షలు పెట్టి కొన్నారు. వీటిని వినియోగించాలంటే ఐడిన్‌ తప్పనిసరి. డిస్పెన్సరీల్లో గత ఐదేళ్లుగా ఐడిన్‌ అందుబాటులో లేదు. అవసరమైన ఐడిన్‌ కొనకుండా మిగతా వాటికి డబ్బులు వృథా చేశారు. వాస్తవానికి కాటన్‌ ఒక బండిల్‌ ధర బయట రూ.80 ఉంటే ఫార్మా కంపెనీ దగ్గర రూ.250 చెల్లించి కొన్నారు. ఇలా అన్ని మందులనూ అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారు.ఇఎస్‌ఐ ఎపిఎంఎస్‌ఐడిసి నుంచి మందులు కొనుగోలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా రెడ్డిస్‌ ల్యాబ్‌, గ్లెన్‌ మార్క్‌, భారత్‌ బయోటెక్‌, అరబిందో వంటి ప్రైవేటు కంపెనీల దగ్గర కొనుగోలు చేస్తోంది.. ఈ విషయాన్ని గుర్తించిన ఫ్రభుత్వం బిల్లులను నిలుపుదల చేసింది. ఈ మేరకు 2015 నుంచి ఇప్పటి వరకూ ఈ కంపెనీలకు సుమారు రూ.250 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఫార్మా కంపెనీలు తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఇఎస్‌ఐ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. పైగా పాత బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్తగా మందులు సరఫరా చేయబోమని బెదిరిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం డిస్పెన్సరీల్లో ఉన్న మందులతోనే సిబ్బంది నెట్టుకొస్తున్నారు.

Related Posts