YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్దతు మోసం

మద్దతు మోసం

వరికి మద్దతు ధర ఏటా ప్రహసంలా మారుతోంది. అధిక పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలు పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సైతం వ్యాపారులు, దళారుల మాయాజలంతో రైతులకు అందడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు దక్కేలా చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 247 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్తే తేమ శాతం అధికంగా ఉందని, మట్టి, రాళ్లు, దుమ్ము ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో 90 శాతం రైతులు మిల్లర్లు, వ్యాపారులు, దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల  ప్రకారం సాధారణ రకం 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1162.50 వంతున అందజేయాల్సి ఉంది. వరి పంటను యంత్రాలతో కోయడంతో  ధాన్యంలో తేమ, కేళీ ఎక్కువగా ఉందని పేర్కొంటూ వ్యాపారులు బస్తాను రూ.900 నుంచి రూ.940కు మించి కొనడం లేదు. మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రూ.920 వరకు కొనుగోలు చేస్తున్నారు.ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రం బస్తా రూ.1100 వరకు కొంటున్నారు. మద్దతు ధర¢ లభించే వరకు ఆగుదామని రైతులు భావిస్తున్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. ముఖ్యంగా నూర్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు సరైన స్థలాలు లేవు.విధిలేని పరిస్థితిలో పలు చోట్ల రైతులు రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో గిట్టుబాటు ధర కోసం నిరీక్షించకుండా రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని అమ్మేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కో బస్తాకు రైతులు సరాసరిన రూ.250 వరకు నష్టపోతున్నారు.

జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా శుక్రవారం వరకు 20,815 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో రబీలో 13.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 11.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా చేసుకున్నారు.వాస్తవంగా రైతులు పండించిన ధాన్యాన్ని కళ్లాల్లోనే కొనుగోలు కేంద్రాల సిబ్బంది సేకరించాల్సి ఉంది. అయితే యంత్రాల ద్వారా వరి కోతలు చేపట్టడంతో ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. 17 శాతానికి మించి తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు సేకరించే అవకాశం లేదు. దీంతో మధ్యవర్తులు, పలువురు మిల్లర్లు తేమ శాతాన్ని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.దీంతో కనీస మద్దతు దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 80 శాతం బొండాలు, 10 శాతం ఎంటీయు 1010 రకం , 10 శాతం సన్నాలు పండించారు. ప్రస్తుతం బొండాలు, 1010 రకం ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రైతుకు కనీస మద్దతు ధర కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉంది.

Related Posts