YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అడవి దొంగల పాలు

అడవి దొంగల పాలు

వేసవికాలం కలప స్మగ్లర్లకు కాసుల కాలం... అక్రమ కలపదందాతో స్మగ్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు... స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దండకారణ్యం విలవిల్లాడుతోంది.. భూపాలపల్లి జిల్లా చుట్టూ ఉన్న అడవులు కలప స్మగ్లర్‌లకు కల్పవృక్షంగా మారుతున్నాయి. కలప స్మగ్లింగ్‌లో అటవీశాఖలోని ఓ ఉద్యోగి, మరో ముగ్గురు కలప డాన్‌లు హల్‌చల్‌ చేస్తున్నారు. సర్వాయిపేట కేంద్రంగా కలప డిస్ట్రిబ్యూషన్‌ జరుగుతున్నా కన్నెత్తి చూసేందుకు కూడా అటవీశాఖ అధికారులు సాహసించలేదు. స్మగ్లర్ల నుంచి నెలనెలా అందే గీతం జీతం కంటే ఎక్కువ ఉండటంతో కొందరు అధికారులు కలప స్మగ్లింగ్‌కు జీ..హుజూర్‌ అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అడవిని దొంగలు దోచుకుంటున్నారు..

మహదేవ్‌పూర్‌ కేంద్రంగా కలప స్మగ్లింగ్‌ జోరందుకుంటుంది. మహదేవ్‌పూర్‌, పలిమెల ప్రాంతాలే అక్రమ కలపకు ప్రధాన అడ్డాలు.. జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల నుంచి కలపను స్మగ్లర్లు గోదావరి దాటిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో వందల ఏళ్ల నాటి టేకు, పెద్దేగి లాంటి విలువైన చెట్లున్నాయి. దండకారణ్యం కావడంతో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో అటువైపు పోలీసులుగానీ, ఫారెస్టు అధికారులుగానీ వెళ్లేందుకు సాహసం చేయలేదు. ఇదే అదనుగా భావించిన స్మగ్లర్లు గిరిజనులకు రోజువారీ కూలీ చెల్లించి పెద్దపెద్ద చెట్లను నేలమట్టం చేస్తున్నారు. అక్కడే వాటిని దుంగలుగా మార్చి గోదావరి సమీపంలో ఉన్న గుట్టలపై నుంచి నీటిలో వదులుతున్నారు. అక్కడి నుంచి తాళ్ల ద్వారా నాటు పడవలతో గోదావరి దాటించి దమ్మూరు, సర్వాయిపేట లాంటి ప్రాంతాలకు కలప తరలిస్తున్నారు. ఇక్కడే ట్రాక్టర్లపైన రెడిమెడ్‌గా ఏర్పాటు చేసిన కర్రకోత మిషన్‌లతో దుంగలను చెక్కలుగా మారుస్తున్నారు. ఇలా మార్చిన చెక్కలను స్మగ్లర్లు వివిధ ప్రాంతాలకు వివిధ రూట్లలో తరలిస్తున్నారు. భూపాలపల్లి అడవులు స్మగ్లర్లకు కల్పవృక్షాలుగా మారుతున్నాయి.

మహదేవ్‌పూర్‌ అటవీశాఖ డివిజన్‌లో ఓ ఉద్యోగి కలప స్మగ్లర్‌ అవతారమెత్తాడు. అతని కనుసన్నల్లోనే ఈ ప్రాంతంలో కలప స్మగ్లింగ్‌ జరుగుతోంది. చేసేది చిన్న ఉద్యోగమైనా పెద్దపెద్ద స్మగ్లర్లతో చేతులు కలిపి కోట్లాది రూపాయల కలపను తరలిస్తు నయా నయీంగా మారాడనే ప్రచారం జరుగుతోంది. పొలిటికల్‌, ఆఫీసర్లందరినీ మేనేజ్‌ చేసేది ఈ చిరు ఉద్యోగేనట. వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కలపను మహదేవ్‌పూర్‌ కలప డిపోకు తరలిస్తారు. ఇక్కడ టెండర్లు వేసే సమయంలో ఈ చిరుద్యోగి చక్రం తిప్పి తమకు కావాల్సిన వారికి తక్కువ ధరకు కలపను అప్పగించడమో.. లేదా పట్టుకున్న కలపను తక్కువగా చూపించి మిగతా కలపను మాయం చేయడమో ఈ చిరుద్యోగికి కర్రతో పెట్టిన విద్యే. ఇక పలిమెల మండలంలోనే సర్వాయిపేట, దమ్మూరులాంటి ప్రాంతాల్లో ఈ అటవీశాఖ ఉద్యోగికి పెద్ద కలప డెన్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అటవీశాఖలోని కొందరు అధికారులకు నెలనెలా మామూళ్లు వస్తుండటంతో ఈ ఉద్యోగి మరింత ప్రోత్సహిస్తూ అక్రమ కలప దందా కొనసాగించేందుకు సహకరిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇక ఓ ఫారెస్టు రేంజర్‌ సైతం ఏకంగా కలప స్మగ్లర్‌ను వెంట పెట్టుకుని తన పరిధి కాని ప్రాంతాలకు సైతం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. కనీసం తన డివిజన్‌ కూడా కాని ప్రాంతాలకు సదరు రేంజర్‌ వెళ్లి నర్సంపేటకు రెండు లారీల కలపను ఇటీవల తరలించారనే ఆరోపణలు వినబడుతున్నా విచారణ చేసేందుకు జిల్లా అధికారులకు ధైర్యం లేకుండాపోతోందట. కలప స్మగ్లర్లు... వారి అండ ఉన్న ఉద్యోగులంటే హడలిపోతున్నారు.

కలప స్మగ్లింగ్‌లో ఈ శీను రూటే సెపరేటు... శీనంటే ఒక్కరు కాదు.. ముగ్గురున్నారు. ముగ్గురి పేర్లు కూడా శీనులే. ఒకరు ఆజంనగర్‌ ఫారెస్టు రేంజ్‌లోని కలప స్మగ్లర్‌ కాగా, మరొకరు మహదేవ్‌పూర్‌ రేంజ్‌ పరిధిలోని స్మగ్లర్‌, మరొకరు ముత్తారం సమీపంలో సీనియర్‌ కలప డాన్‌. ముగ్గురు కూడా కలప స్మగ్లింగ్‌ లో ఆరితేరిన వారే. వీరి వద్ద 200లకుపైగా బైక్‌లు, పాతిక జీపులు, టాటా సుమోలు, వెయ్యికిపైగా ఎడ్లబండ్లు ఉన్నట్లుగా సమాచారం. రాత్రికిరాత్రే శీను అనుచరులు బైక్‌ల ద్వారా పెట్రోలింగ్‌ చేస్తూ ఫారెస్టు స్క్వాడ్‌లు ఎదురుకాకుండా చూసుకుంటారు. ఇక వీరి వెనకాలే ఎడ్లబండ్లు, జీపులు, టాటాసుమోల ద్వారా కలప స్మగ్లింగ్‌ జరిగిపోతుంది. గుట్టుచప్పుడు కాకుండా డాన్‌ శీనులు అడవిని దోచుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. సర్వాయిపేట, దమ్మూరు, నీలంపల్లి నుంచి ఏటూరునాగారం మీదుగా వరంగల్‌, నర్సంపేట, ఖమ్మం, కొత్తగూడెంలాంటి ప్రాంతాలకు కలపను తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, మహదేవ్‌పూర్‌ మీదుగా కాటారం నుంచి గోదావరిఖనికి, అక్కడి నుంచి బొగ్గు రైళ్లలో విజయవాడ, విశాఖపట్నంలాంటి సుదూర ప్రాంతాలకు సైతం కలప తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీఏటా అక్టోబర్‌ నుంచి జూలై వరకు కలప స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోందని తెలుస్తోంది. అటవీశాఖ అధికారుల్లో కిందిస్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు ఒక్కో అధికారికి ఒక్కో రేటు కట్టించి దాడులు జరగకుండా స్మగ్లర్లు వారి నోటికి తాళం వేస్తున్నారనే ప్రచారం ఉంది.

కలప స్మగ్లింగ్‌ భూపాలపల్లివైపు మళ్లుతోంది.. ఇటీవల కాలంలో భూపాలపల్లిలో సామిల్‌లకు టన్నుల కొద్ది అక్రమ కలప చేరుతున్నట్లు తెలుస్తోంది. పట్టణ సమీపంలోని అడవుల్లో కలపను దాచిపెట్టి రాత్రికిరాత్రే సామిల్లకు తరలించి అక్రమాన్ని సక్రమంగా మార్చే పనిలో కొంతమంది అటవీశాఖ అధికారులు సామిల్‌ యజమానులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. లక్షలాది రూపాయల కలప సామిల్‌లలో అక్రమంగా నిల్వ ఉన్నా అటవీశాఖ అధికారులు కనీసం కన్నెత్తికూడా చూడటం లేదని తెలుస్తోంది. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలోని సామిల్‌లకు భూపాలపల్లి అడవుల నుంచి జోరుగా కలప తరలుతోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని కమలాపూర్‌, ఉప్పల్ ప్రాంతంలోగల సామిల్లుల వద్ద టన్నుల కొద్ది అక్రమ కలప ఇక్కడి నుంచే తరలించి నిల్వ చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సామిల్‌ల వద్ద అక్రమ కలప నిల్వ ఉన్నట్లు ఫారెస్టు అధికారులకు తెలిసినా దాడి చేసేందుకు సాహసించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా జీతం కంటే స్మగ్లర్లు, సామిల్లర్లు ఇచ్చే గీతం ఎక్కువగా ఉండటంతో అన్నీ తెలిసినా ఏమీ తెలియని అమాయకుల్లా కొందరు అటవీశాఖ అధికారులు నటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అక్రమ కలప రవాణా అరికట్టేందుకు స్మగ్లర్ల జోరుకు ముకుతాడు వేసి అడవులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts