YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

గొర్రెలుటుపోతున్నాయ్..?

గొర్రెలుటుపోతున్నాయ్..?

గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చేందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం దళారులకు వరంగా మారింది. మొదటి విడత మంజూరైన యూనిట్లలో దాదాపు వందల సంఖ్యలో యూనిట్లను లబ్ధిదారులు ఇప్పటికే అమ్ముకున్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు దళారులు గ్రామానికో ఏజంటును నియమించుకుని గొర్రెలను కొనుగోలు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.

వేసవికాలం కావడంతో ఈ వాతావరణానికి గొర్రెలు తట్టుకోలేవని, వ్యాధుల బారిన పడి చనిపోతాయంటూ మాయమాటలతో గొర్రెల కాపరులను బురిడీ కొట్టిస్తూ తక్కువ రేటుకే అమ్ముకునేలా చేస్తున్నారు. పలు గ్రామాలలో గొల్ల,కురుమల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తులు దళారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిని ఉపయోగించుకుంటూ దళారులు తెలివిగా గొర్రెల కాపరుల వద్దకు బేరం కోసం పంపిస్తూ తరువాత రంగంలోకి వారు దిగుతున్నారు. వీరు చెబుతున్న విషయాలన్ని నిజమేనని నమ్మి సబ్సిడీ గొర్రెలను తెగనమ్ముకుంటున్నారు. వంద గొర్రెలను కొనుగోలు చేసిస్తే రూ.30 వేల వరకు కమీషన్‌ రూపంలో ఏజంటుకు ముడుతున్నట్టు తెలిసింది. కాగా సబ్సిడీ గొర్రెలను అమ్ముకుంటున్నారని గ్రామాల నుంచి ఏవరైన పశువైద్యాధికారులకు గాని, సిబ్బందికి గాని ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే, ఏజంట్లుగా పనిచేస్తున్న వారికి ఫలానా వ్యక్తి ఫోన్‌ చేశాడంటూ సమాచారం లీకవుతోందంటున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయని పలువురి ద్వారా తెలిసింది. గ్రామ ఏజంట్లకు పశువైద్యశాలలో పనిచేసే కొంత మంది అధికారులకు, సిబ్బందికి మంచి పరిచయాలుండడం మూలంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలకు దాణా అందిస్తుండడంతో యూనిట్లను పరిశీలించి అందజేస్తే ఎన్ని గొర్రెల యూనిట్లు అమ్ముకున్నారో బయటపడనుంది.

ప్రభుత్వం అందించిన సబ్సిడీ గొర్రెలను అమ్ముకుంటున్నారని, దాణా సైతం అమ్ముకునే పరిస్థితికి తీసుకురావద్దని సాక్షాత్తు ఇటీవల జరిగిన మండల సభలో ప్రజాప్రతినిధులు పశుసంవర్ధక శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో డీసీఎంలు, ఆటోల్లో తరలిస్తున్న అనేక యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు. తమకు తెలియకుండా గొర్రెలను అమ్ముకున్న వారి వద్దకు వెళ్లి కొందరు అధికారులు గతంలో బ్లాక్‌మెయిల్‌ చేయడంతో విధిలేక కొంత సొమ్మును ముట్టజెప్పారనే ప్రచారం జోరుగా సాగింది. కట్టడి చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందని కొందరు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారులకు ఫిర్యాధులు చేయడంతో రహస్య విచారణ జరిపించారు. ఏది ఏమైనా సబ్సిడీ గొర్రెలతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలోని 13 మండలాల్లో మొదటి విడతగా 10,653 యూనిట్లను గొర్రెల కాపరులకు అందజేయాలని నిర్ణయించారు. ఇందులో 8395 యూనిట్లకు లబ్ధిదారులు డీడీలు చెల్లించగా అధికారులు అందించారు. వాటిలో బచ్చన్నపేట777 యూనిట్లు, చిలుపూరు 443, దేవరుప్పుల 732, స్టేషన్‌ఘన్‌పూర్‌ 558, గుండాల 691, జనగామ 1089, కొడకండ్ల 473, లింగాలఘణపురం 757, నర్మెట 321, పాలకుర్తి 680, రఘనాథపల్లి 713, తరిగొప్పుల 366, జఫర్‌గడ్‌ 795 యూనిట్లు అందించారు. మిగతా 2258 యూనిట్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులు వివిధ కారణాలతో చెల్లింపులు జరపకపోవటంతో నిలిచిపోయాయి. మంజూరైన వాటిలో అధికారులు 7427 యూనిట్లకు సంబంధించి ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. 6687 యూనిట్లకు పాలసీలు పూర్తయ్యాయి. కాగా రవాణా చేసే సమయంలో పలు గొర్రెలు మృతి చెందడం, అస్వస్థతకు గురై ఇక్కడికి వచ్చిన తరువాత చనిపోవడంతో వాటి వివరాలను మళ్లీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉండగా కొంత మంది పశువైద్యాధికారులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు పలువురు గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల ట్రాన్స్‌పోర్టులో సైతం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. విజిలెన్స్‌ కమిటీలున్నా ఎక్కడ కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి.

Related Posts