ఈడీ ఆఫీసులో చార్మీ
హైదరాబాద్, సెప్టెంబర్ 2,
టాలీవుడ్‌లో దుమారం రేపిన డ్రగ్స్ కేసులో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు విషయమై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసర్స్.. మంగళవారం రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను విచారించి ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. విచారణలో భాగంగా హీరోయిన్ ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకొని విచారణ ఎదుర్కొంటోంది.ప్రధానంగా కెల్విన్‌తో ఉన్న డ్రగ్స్ లింకులపై ఆరా దీస్తూ అదే కోణంలో ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. కెల్విన్ డ్రగ్స్ దందాలో ఛార్మి భాగస్వామ్యం ఎంతవరకు ఉంది? ఇంకా ఎవరెవరి ప్రమేయంతో ఈ డ్రగ్స్ దందా నడుస్తోందనే వివరాలు సేకరిస్తున్నారట. కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఛార్మి పేరు 'దాదా' అని సేవ్ చేసి ఉన్నట్టు తెలుసుకున్న ఈడీ అధికారులు ఆ పేరుతో ఉన్న ట్రాన్సాక్షన్ లిస్ట్ చెక్ చేస్తున్నారట. ఆమె వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు ఆమె ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగిన లావాదేవీలనూ ఆఫీసర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మి మధ్య డ్రగ్స్ రాకెట్‌కి సంబంధించి ఎలాంటి లింక్స్ ఉన్నాయనే దానిపై కూడా ఫోకస్ పెట్టారట ఈడీ అధికారులు.గతంలో ఇదే డ్రగ్స్ పెడల్ ఇష్యూపై 2017 సంవత్సరంలో ఛార్మి విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ తెరపైకి వచ్చి పలువురు సెలబ్రిటీలను ఇన్వెస్టిగేట్ చేస్తుండటం చర్చనీయాంశం అయింది. ఇకపోతే డ్రగ్స్ కేసులో తన విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి రకుల్ ప్రీత్ సింగ్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చింది. కొన్ని కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనని, తన విచారణ కోసం మరో డేట్ ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ముందుగా కేటాయించిన డేట్ సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తూ రకుల్‌కి షాకిచ్చారు ఈడీ ఆఫీసర్స్. తాజా పరిణామాలు చూస్తుంటే ఈడీ అధికారులు ఈ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టి కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.