YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వరంగల్ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్

వరంగల్ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్

వరంగల్ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
వరంగల్, సెప్టెంబర్ 2, 
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన వరంగల్ మూడు హత్యల ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రం పోచ‌మ్మ మైదాన్‌కు స‌మీపంలోని ఎల్‌బీ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్న చాంద్‌పాషా, అత‌ని భార్య స‌బీర బేగం, బావ‌మ‌రిది ఖ‌లీల్‌లు బుధ‌వారం తెల్లవారుజామున దారునహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన చాంద్‌పాషా సొద‌రుడు ష‌ఫీ, అత‌డి ఐదుగురు అనుచరులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్ , మీరా అక్బర్, పాషాలను గురువారం ఉద‌యం అరెస్ట్ చేసిన‌ట్లు వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ త‌రుణ్ జోషి తెలిపారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన కమిషనర్.. కేసు వివరాలను క్షుణ్ణంగా వివరించారు.
పరకాలకు చెందిన చాంద్‌పాషా 15 ఏళ్ల క్రితం వరంగల్‌ ఎల్బీనగర్‌లో స్థిరపడ్డారు. అతని పెద్ద తమ్ముడు షఫీ కుటుంబంతో ఎల్బీనగర్‌ సమీపంలోనే నివసిస్తున్నాడు. చిన్నతమ్ముడు గఫూర్‌ పాషా పరకాలలో ఉంటున్నాడు. చాంద్‌పాషా, షఫీ కలిసి పశువుల వ్యాపారం చేయగా.. ఇందులో సుమారు రూ. 1.20 కోట్ల నష్టం వచ్చింది. దీన్ని అన్నదమ్ములు చెరి సగం భరించాలని గతేడాది పంచాయితీలో నిర్ణయించారు. దాని ప్రకారం చాంద్‌పాషా తొలుత రూ.40 లక్షలు, కొన్ని రోజుల తర్వాత రూ. 20 లక్షలు తమ్ముడికి చెల్లించాడు. అయినప్పటికీ మరికొంత సొమ్ము ఇవ్వాలంటూ అన్నపై షఫీ కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. దీనిపై పలుమార్లు పంచాయితీలు జరిగినా కొలిక్కి రాలేదు.దీంతో అన్నతో పాటు అతడి కుటుంబాన్ని నాశనం చేయాలని షఫీ నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన బోయిని వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్ , మీరా అక్బర్‌, పాషాల స‌హాయం కోరాడు. వారు సరేననడంతో హత్యలకు షఫీ నెల రోజులుగా ప్లాన్ వేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైద‌రాబాద్‌లో వేట క‌త్తులు, చెట్లను కోసే బ్యాట‌రీ క‌ట్టర్ కొనుగోలు చేసి ఇంట్లో భ‌ధ్రప‌రుచుకున్నాడు. వారంతా బుధవారం రాత్రి మద్యం సేవించి తెల్లవారుజామున రెండు ఆటోల్లో ఎల్బీనగర్‌లోని చాంద్‌పాషా నివాసానికి చేరుకున్నారు. అంతా గాఢనిద్రలో ఉండగా, లోనికి ప్రవేశించి విద్యుత్తు మెయిన్‌ ఆపేశారు. బ్యాటరీతో పనిచేసే రంపంతో తలుపును కోసేశారు. శబ్దాలతో ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా ఆటో ఇంజిన్‌ను ఆన్‌ చేశారు. అలికిడికి నిద్ర లేచిన చాంద్‌పాషా బెడ్‌రూమ్ నుంచి బయటికి వచ్చేలోగానే షఫీ, అతడి మనుషులు ఇంట్లోకి చొరబడ్డారు.చాంద్ పాషా కళ్లలో కారం కొట్టి కత్తులు, రంపంతో అతని మెడను నరికేశారు. పాషా భార్య సబీరా బేగం (50), వారి ఇద్దరు కుమారులు ఫహద్‌ పాషా (28), సమీర్‌ పాషా (21), సబీరా సోదరుడు ఖలీల్‌ పాషా (45)లపైనా నిందితులు కత్తులు, రంపంతో క్రూరంగా దాడి చేశారు. చాంద్‌పాషా, సబీరా, ఖలీల్‌ రక్తపు మడుగులో విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పాషా కుమార్తె రుబీనా తన రెండేళ్ల చంటిబిడ్డను ఎత్తుకుని చంపవద్దంటూ ప్రాధేయపడడంతో ఆమెను వదిలేశారు. నిందితులు వెళ్లిపోయాక రుబీనా పోలీసులకు ఫోన్‌ చేయగా, విషయం వెలుగుచూసింది.చాంద్‌పాషా ఇంటి మొదటి అంతస్తులో కిరాయికి అద్దెకుండే అజీమ్‌ అనే వ్యక్తి అలికిడి విని బయటకు వచ్చేసరికే నిందితులు పారిపోతున్నారు. కిందికి వచ్చి చూడగా చాంద్‌పాషా కుమారులిద్దరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆయన వెంటనే 108కి ఫోన్ చేశాడు. ఆ ఇద్దరినీ తొలుత వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరి శరీరాలను దుండగులు కిరాతకంగా బ్రెడ్డును కోసినట్లు కోసేశారని, రంపంతో గాట్లు పెట్టారని వైద్యులు చెబుతుంటే వినేవారికి ఒళ్లు గగుర్పొడిచింది. సబీరా సోదరుడు ఖలీల్‌ స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం. మంగళవారం వరంగల్‌కు వచ్చిన అతడు వర్షం కురవడంతో సోదరి ఇంట్లోనే ఉన్నాడు. అన్నదమ్ముల వివాదంతో సంబంధం లేకపోయినా హత్యకు బలైపోయాడు. నిందితులు ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

Related Posts