గుంటూరు, సెప్టెంబర్ 3,
వును… వైసీపీలో కీలక యువ నేత, ఎంపీగా ఉన్న నాయకుడికి.. ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందా ? జగన్ కనీసం ఆయనకు అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వడంలేదా ? అసలు ఆ ఎంపీ చెప్పాలనుకున్నా ఇప్పటికే చెప్పిన ఏ విషయాన్నీ.. జగన్ పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఆ ఎంపీనే గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న లావు శ్రీకృష్ణదేవరాయులు. వాస్తవానికి గత ఎన్నికల ముందు.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు లావు శ్రీకృష్ణదేవరాయులు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సీఎంకు, లావుకు మధ్య సన్నిహిత సబంధాలు బాగానే నడిచాయి.అయితే.. గత ఏడాది కాలంగా లావు శ్రీకృష్ణదేవరాయులుకు, సీఎంకు మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. దీనికి ప్రధానంగా.. ఎంపీపై జగన్‌కు కొందరు ఫిర్యాదులు మోశారని చెబుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అమరావతిని దూరం పెట్టింది. దీంతో ఇక్కడి రైతులు.. ఆందోళన బాటపట్టారు. అంతేకాదు ప్రభుత్వంపై కోర్టుల్లోనూ కేసులు వేశారు. సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. దీంతో వైసీపీ నేతలు ఎవరూ కూడా రాజధానిపై మాట్లాడకుండా.. రైతులు ఏర్పాటు చేసుకున్న శిబిరాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పడ్డారు.ఇంత హడావుడి జరుగుతున్న సమయంలో కొన్నాళ్ల కిందట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అమరావతి ప్రాంతాని కి వెళ్లి.. దాదాపు గంటసేపు ఇక్కడి రైతులతో ముచ్చట్లు పెట్టుకున్నారు. వారిని అనునయించారు. ఆయన ఏం మాట్లాడారనేది పక్కన పెడితే.. అసలు పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా.. ఎంపీ..అమరావతి రైతులను కలుసుకోవడమే.. పెద్ద నేరంగా.. ఎంపీపై కొన్ని ఫిర్యాదులు సీఎంకు చేరాయి. రాజధాని అమరావతికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సానుకూలమని.. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉండడమే రీజనని వైసీపీ సీనియర్ల మధ్య కూడా కొన్నాళ్లు చర్చసాగింది. దీంతో ఈ పరిణామం.. ఎంపీకి, సీఎంకి మధ్య గ్యాప్ పెంచిందని అంటున్నారు. ఇక, ఆ తర్వాత.. ఎంపీ ఏం చెప్పినా.. జగన్ పట్టించుకోవడం మానేశారని అంటున్నారు.ఇక, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ బంధువర్గం.. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వర్గంపై భౌతిక దాడికి దిగింది. ఏకంగా ఎంపీ ప్రయాణిస్తున్న కారునే అడ్డగించి వెనక్కి పంపారు. ఈ పరిణామంపై ఎంపీ.. సీఎం సలహాదారు సజ్జలకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక, గురజాల ఎమ్మెల్యేకాసు మహేష్‌రెడ్డితోనూ లావు శ్రీకృష్ణదేవరాయులుకు పొసగడం లేదు. అలాగే వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీతోనూ లావుకు తీవ్రమైన గ్యాప్ ఉంది.ఆయా సమస్యల పరిష్కారం కోసం లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రయత్నాలు చేస్తున్నా.. సీఎం జగన్ మాత్రం అప్పాయిం ట్‌మెంట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ఇవన్నీ ఇలా.. ఉంటే.. లావు శ్రీకృష్ణదేవరాయులు సీఈవోగా ఉన్న విజ్ఞాన్ విద్యాసంస్థలకు సంబంధించి.. ప్రభుత్వాన్ని నిరంతరం తిట్టిపోసే.. ఓ పత్రికకు భారీ ఎత్తున యాడ్ ఇవ్వడం.. కూడా జగన్ ఆగ్రహానికి కారణమై ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ గ్యాప్ ఇలానే కొనసాగుతుందో.. సమసిపోతుందో చూడాలి.