రాత్రి వేళ కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడా అని ఇప్పుడు ఇంట్లో వెతకడం లేదు.. పక్క వ్యక్తి టైం ఎంత? అంటే ఎవరూ ముంజేతిని చూసుకోడం లేదు. ఈవేళ ఏ వారమని అనుమానం వస్తే ప్యాకెట్ క్యాలెండర్ చూడడం లేదు. స్మార్ట్ ఫోన్. స్మార్టుగా ఇంట్లోకి దూరి ఎన్నో వస్తువులను దూరం చేసింది.ఆడుకునే ఆటబొమ్మలు మాయం అయ్యాయి. బంధువుల యోగక్షేమాలు తెలిపే ఉత్తరాలు దాదాపు శుభలేఖలకే పరిమితమైపోయాయి. సుందర దృశ్యాలు బంధించే కెమేరాలు, జ్ఞాపకాలను పదిలంగా ఉంచే ఫొటో ఆల్బమ్‌లు అరుదుగా కనిపిస్తున్నాయి. టార్చ్‌లైట్, వాచ్, అలారం, క్యాలెండర్, కాలిక్యులేటర్, కెమెరా, రేడియో, ఆడియో ప్లేయర్, రికార్డర్, డిక్షనరీ, పుస్తకాలు, గేమ్స్, లేఖలు ఇలా ఎన్నో వస్తువుల అవసరాన్ని స్మార్ట్ ఫోన్ తీరుస్తోంది.సుప్రభాతం వినిపించే రేడియోలు మాయమయ్యాయి. సంగీతంతో ఉత్సాహాన్ని నింపే టేప్ రికార్డులు చూద్దామన్నా లేవు. కాలక్షేపంగా ఎవరి చేతిలోనూ పుస్తకాలు కనిపించడం లేదు. చిన్నపిల్లలు రోజంతా స్నేహితులతో కలసి ఉల్లాసంగా ఆటలాడుకునే వారు. ఈ ఆటలతో వారికి శారీరక వ్యాయామంలా మారి ఆరోగ్యకరంగా ఉండేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చిన్నారులు ఆటలకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఒక మూలన కూర్చుని గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. పెద్దవారు ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఇప్పుడు పక్కన ఎవరున్నారన్న విషయం గుర్తించక స్మార్ట్‌ఫోన్ యాప్‌లతో గడిపేస్తున్నారు. ఏమైనా పుస్తకాలు, నవలు, కథలు చదవాలంటే గ్రంథాలయానికో, లేక అద్దెకు ఇచ్చే దుకాణాలకు వేళ్లేవారు. రోజుకింత అద్దె చెల్లించి పుస్తకాన్ని తెచ్చుకుని చదివి తిరిగి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పుస్తకాలు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏ పుస్తకం కావాలన్నా పీడీఎఫ్ రూపంలో లభిస్తుంది. దాన్ని ఎంచక్కా డౌన్‌లోడ్ చేసుకుని చదివేసుకోచ్చు.ఒకప్పుడు పుస్తకం హస్తాభరణం అనేవారు. కానీ ఇప్పుడు స్మార్టు ఫోన్ ఆ అవసరాన్ని భర్తీ చేసింది. యువతీ యువకుల వద్ద స్మార్టుఫోన్ లేకపోతే అవమానంగా భావిస్తున్నారు. ఇప్పుడు వారికి అవసరమైన పుస్తకాలను సైతం ఆన్‌లైన్‌లోనే చూసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు ఎవరైనా బాగా చదువుతున్నాడంటే అతని ఆచూకీ కోసం ముందుగా లైబ్రరీకి వెళ్లేవారు. ఇప్పుడు తలవంచుకుని స్మార్టు ఫోన్‌వైపు చూస్తున్నారు. చిన్నపిల్లలకు ఎదైనా ఇంగ్లీష్ పదం అర్థం కాకపోతే డిక్షనరీలో వెతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంటనే మొబైల్ డిక్షనరీ చూసుకుంటున్నారు.