విశాఖపట్టణం, సెప్టెంబర్ 3,
నీ గ్రూపునకు విశాఖలోని మధురవాడ ఐటి సెజ్ హిల్ నంబర్.4లో 130 ఎకరాలను డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిని అమలు చేసే పనిలో ఎపిఐఐసి అధికారులు ఉన్నారు. భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ 'ప్రజాశక్తి'కి ఎపిఐఐసి జోనల్ మేనేజర్ సి.యతిరాజ్ మంగళవారం చెప్పారు. అదానీ డేటా సెంటర్ ఇప్పటికే ఎకరాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వానికి రూ.130 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. రూ.14,630 కోట్ల పెట్టుబడులు రానున్నామని, 24 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నామని గత నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ సెంటర్ నివేదించింది. ఈ నేపథ్యంలో మధురవాడకు అతి సమీపంలోని రుషికొండ ఐటి సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్) శ్రీరామ్ పనోరమ హిల్స్ వద్ద భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. ఇది ఎపి టూరిజం డిపార్టుమెంట్‌కు చెందిన భూమని తెలుస్తోంది. ఈ భూముని అదానీ డేటా సెంటర్‌కు అప్పగించే దిశగా ఫైళ్లు విశాఖలో చకాచకా కదులుతున్నాయి. 130 ఎకరాలుగానూ 82 ఎకరాలను డేటా పార్కు కోసం వినియోగించనున్నారు. దీంట్లోనే 20 మెగావాట్ల సోలార్ ప్లాంట్, 28 ఎకరాలు ఐటి బిజినెస్ పార్కు, 11 ఎకరాలు స్కిల్ డవలప్‌మెంట్ యూనివర్సిటీ, తొమ్మిది ఎకరాలు రిక్రియేషన్ కోసం కేటాయించనున్నారు. రుషికొండ ఐటి సెజ్ కోసం రైతుల నుంచి భూములను కారు చౌకగా గతంలో సేకరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.20 కోట్లు ఉంది. ఈ లెక్కన అదానీ డేటా సెంటర్‌కు ఇస్తోన్న 130 ఎకరాల భూమి విలువ రూ.2,600 కోట్లు ఉంటుంది. సెజ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని రూ.130 కోట్లకే కట్టబెడుతోంది.అదానీ డేటా సెంటర్‌కు చంద్రబాబు హయాంలో సుమారు 1,300 ఎకరాలు కేటాయించారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, రెండు లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని అప్పట్లో పేర్కొన్నారు. కాపులుప్పాడలో ఎపిఐఐసి ద్వారా భూమిని అప్పటి టిడిపి ప్రభుత్వం 2018లో ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డేటా సెంటర్‌కు హుటాహుటిన అనుమతులు ఇచ్చేస్తూ కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఈ భారీ ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2020లో ఈ కేటాయింపును రద్దు చేసింది. ఇదే ప్రభుత్వం ఇప్పుడు అదానీ డేటా సెంటర్‌కు భూమిని కారు చౌకగా కేటాయించడం గమనార్హం.