విజయవాడ
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు అయిదు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ అయిదు అవార్డులు కూడా టెక్నాలజీ విభాగంలో వచ్చాయని వెల్లడించారు. ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు.విజయవాడలో మాట్లాడుతూ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని, దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు.పాస్పోర్ట్ సేవలోనూ దేశంలోనే ఏపీ అగ్రస్ధానంలో ఉందని డీజీపీ తెలిపారు. పాస్పార్ట్ వెరిఫికేషన్ టెక్నాలజీ సాయంతో చేస్తున్న విధానం జాతీయ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలబెట్టిందన్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకి దక్కాయయని, ఈ అవార్డులు పోలీస్ శాఖపై మరింత బాద్యత పెంచాయని పేర్కొన్నారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ శాఖ పనితీరుని మరింతగా మెరుగుపరుచుకుంటున్నామన్నారు. కోవిడ్ సమయంలో పోలీస్ పనితీరు ప్రశంసలు అందుకుందని చెప్పారు.